
నాణానికి ఒక వైపే చూస్తున్నారని రెండో వైపు చూస్తే పవన్ కల్యాణ్ తట్టుకోలేరు
సాక్షి, విజయవాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిప్పులు చెరిగారు. తనపై చేసిన ఆరోపణలపై ఎన్ని కమిటీలు అయినా వేసుకొని నిరూపించాలని సవాల్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఓ గల్లీ నాయకుడి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను రాజ్యాంగయేతర శక్తిగా ఎదుగుతున్నానని చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. తానను రౌడీ షీటర్ అని పవన్ చెప్పాల్సిన అవసరం లేదని, తానేంటో దెందులూరు ప్రజలకు తెలుసన్నారు. నాణానికి ఒక వైపే చూస్తున్నారని రెండో వైపు చూస్తే పవన్ తట్టుకోలేరని హెచ్చరించారు.
నియోజక వర్గం అభివృద్ధిపై ఒక్క కామెంట్ చేయలేకనే వ్యక్తిగతంగా విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే పవన్ కల్యాణ్ మూడు రోజుల అన్నం తినడం మానేస్తాడని ఎద్దేవా చేశారు. పవన్‌కు దమ్ముంటే దెందులూరులో తనపై పోటీ చేసి గెలవాలి సవాల్ చేశారు. తనపై పవన్ గెలిస్తే ఆయనకు సన్మానం చేసి ఆయనతో నడుస్తానన్నారు. ఓడిపోతే షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోవాలని పేర్కొన్నారు. పార్లమెంట్ లో ఎమ్మెల్యేలు ఉంటారంటూ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 18 ఏళ్ల వాడిని పోటీకి నిలబెడతాను అంటున్నారు. ఆ వయసులో అసెంబ్లీలో పోటీ చేసేఅవకాశం లేదని కూడా పవన్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. రాజకీయ జ్ఞానం కోసం పవన్ తనతో ట్యూషన్ పెట్టించుకోవాలని ఎద్దేవా చేశారు.
బుధవారం దెందులూరులో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఎమ్మెల్యే చింతమనేనిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చింతమనేనిపై చాలా కేసులున్నా .. రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోవడం లేదని పవన్ ఆరోపించారు. విదేశాల్లో అయితే పర్యవసనాలు తీవ్రంగా ఉండేవని వ్యాఖ్యానించారు.