తేరు వీధిలో అర్ధంతరంగా ఆగిపోయిన రోడ్డు విస్తరణ పనులు
ప్రశాంతతకు మారుపేరైన రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు శాంతికాముకులనడంలో సందేహం లేదు. అయితే మంత్రి కాలవ శ్రీనివాసులు మాత్రం ఇక్కడి ప్రజలను ఇంకో విధంగా భావిస్తున్నాడు. ఏమి చేసినా ప్రజలు ప్రశ్నించరు.. ఏమి చెప్పినా వెర్రివెంగళప్పల్లా నమ్ముతారు అని అనుకున్నాడు. అందుకే పట్టణంలో నాలుగు కి.మీ రోడ్డు విస్తరణకు గాను 1.2 కి.మీ, మాత్రం అదీ అసంపూర్తిగా పనులు చేసి, ప్రచారంలో మాత్రం రాయదుర్గం రోడ్లు వెలిగిపోతున్నాయి అని గొప్పలు చెబుతున్నాడు. మాటలకు, పనులకు పొంతన లేకుండా పోతోంది.
సాక్షి, రాయదుర్గం: రాయదుర్గం పట్టణంలో నాలుగు వరుసల రోడ్ల విస్తరణ, విద్యుత్ దీపాల అమరిక కోసం 2014లో నిధులు మంజూరయ్యాయి. పాలశీతలీకరణ కేంద్రం నుంచి మొలకాల్మూరు రోడ్డు బైపాస్ రోడ్డుకు లింక్ కలిపే 4 కి.మీ రోడ్డు పనులు 2015లో ప్రారంభమయ్యాయి. నాలుగేళ్లు గడిచినా మంత్రి నియోజకవర్గంలోని ప్రధాన మున్సిపాల్టీలో 4 కి.మీ రోడ్డు కూడా వేయని దుస్థితి.
నాలుగేళ్లుగా ముక్కి, మూలిగి 1.2 కి.మీ సీసీ రోడ్డు, వంద మీటర్ల బీటీ రోడ్డు మాత్రం వేశారు. వినాయక సర్కిల్‌లో కూడా అర్ధంతరంగా ఆగిపోయింది. ప్రధానంగా ప్రమాదాలు జరిగే తేరు మలుపు వద్ద రోడ్డు పనులు ఆగిపోయాయి. అలాగే వేసిన 1.2 కి.మీ. ప్రధాన సీసీ రోడ్డు నుంచి వీధుల్లోకి వెళ్లే రోడ్లకు కూడా లింక్ కలుపకుండా పనులు ఆగిపోయినా మంత్రికి మాత్రం ఇలాంటివి అగుపడవు. ప్రజలు , వాహనదారులు ఎదుర్కొంటున్న కష్టాలు అసలు కనబడవు. వీటి గురించి మంత్రి గాని, ఆయన అనుచరగణం గాని కనీసం ఆలోచించిన దాఖలాలు లేవు.
2 కణేకల్లు రోడ్డును ఫారెస్ట్‌లో 3 కి.మీలు, పూలచెర్ల రోడ్డు నుండి నల్లంపల్లి సమీపం వరకు 1 కి.మీ రిటైర్డ్ ఉపాధ్యాయుడు పోలయ్య తోట నుంచి క్రాసింగ్ వరకు 2 కి.మీలు అక్కడి నుంచి కణేకల్లు వరకు 8 కి.మీ డబుల్ రోడ్డు చేయించలేని అసమర్థుడు మంత్రి అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి పదవి లేని ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలే నయమని, పూర్తి స్థాయిలో ఆయా పట్టణాల్లో రోడ్లు వేశారని దుర్గం ప్రజలు పేర్కొంటున్నారు.
మంత్రిగా ఉంటూ తన అభివృద్ధి మాత్రమే చూసుకున్న కాలవ ‘దుర్గం’ అభివృద్దికి ఏమాత్రం చొరవ చూపలేదని ఆరోపిస్తున్నారు. రాయదుర్గం పట్టణంలో జరిగిన రోడ్డు విస్తరణలో రోడ్డు మధ్య అమర్చిన వీధి దీపాలు కూడా ఒకరోజు వెలిగితే రెండురోజులు వెలగని పరిస్థితి నెలకొందని విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment