ఇది తప్పే.. | TDP mocked democracy in Legislative Council | Sakshi
Sakshi News home page

ఇది తప్పే..

Published Thu, Jan 23 2020 4:11 AM | Last Updated on Thu, Jan 23 2020 9:02 AM

TDP mocked democracy in Legislative Council - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యాన్ని ప్రతిపక్ష టీడీపీ అపహాస్యం చేసింది. అత్యున్నత శాసన వ్యవస్థ వేదికగా రాజ్యాంగాన్ని కాలరాసింది. తన రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతానని, అడ్డగోలు దోపిడీ కోసం దేనికైనా తెగిస్తానని ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోసారి నిరూపించారు. అందుకోసం శాసనమండలిని వేదికగా చేసుకుని కుట్ర పూరితవైఖరితో వ్యవహరించారు. ప్రాంతీయ సమానాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపించేలా టీడీపీ మంత్రాంగం నెరిపింది. ‘ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించడం నిబంధనలకు విరుద్ధం.. టీడీపీ ఇచ్చిన నోటీసు నిబంధనల మేరకు లేదు..’ అని శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ స్వయంగా చెబుతూనే ఆ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తూ రూలింగ్‌ ఇవ్వడం విస్మయపరిచింది.

అమరావతిలో భారీగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి లక్షల కోట్ల రూపాయల రియల్‌ ఎస్టేట్‌ అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు టీడీపీ అంతగా బరితెగించింది. ఇందులో భాగంగా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి శాసన మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ను ప్రభావితం చేసిన తీరు విస్మయ పరిచింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏకంగా శాసనమండలి చైర్మన్‌ సీటుకు ఎదురుగా మీడియా గ్యాలరీలో నాలుగు గంటలపాటు కూర్చొని రాజకీయ కుతంత్రాన్ని రచించడం టీడీపీ దిగజారుడుతానినికి నిదర్శనంగా నిలిచింది. వికేంద్రీకరణ బిల్లుపై కాలయాపన చేసేలా చంద్రబాబు కుతంత్రాన్ని అమలు చేసేందుకు శాసనమండలిలో టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు సైంధవ పాత్ర పోషించారు. ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలు ఇస్తూ రాష్ట్ర శాసన మండలి వేదికగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్ర శాసన వ్యవస్థ చరిత్రలో బుధవారం ఓ చీకటి రోజుగా నిలిచిపోయిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.  
 
శాసనమండలి వేదికగా టీడీపీ కుట్ర రాజకీయం 
ప్రాంతీయ సమానాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులను అడ్డుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ బుధవారం కూడా కుట్ర పూరితంగా వ్యవహరించింది. నిబంధనలకు విరుద్ధంగా రూల్‌ 71 పేరిట చర్చకు పట్టుపడుతూ మంగళవారం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేయడం తెలిసిందే. పోనీ బుధవారం అయినా బిల్లుపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. కానీ టీడీపీ మళ్లీ తన దుర్నీతిని ప్రదర్శించింది. టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదంటూ మధ్యాహ్నం వరకు సభా కార్యక్రమాలను అడ్డుకుంది.
బుధవారం రాత్రి విశాఖలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ప్రజలు 

మధ్యాహ్నం అయినా బిల్లులపై సజావుగా చర్చించేందుకు సహకరించిందా అంటే అదీ లేదు. టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు, ఆ పార్టీ సభ్యులు లోకేశ్, తిప్పేస్వామి, రాజేంద్రప్రసాద్, దీపక్‌రెడ్డి తదితరులు పదే పదే సభా కార్యకలాపాలకు అడ్డుపడ్డారు. అప్పటికే ఓ రోజు వృథా కావడంతో ఇక కాలయపన చేయకూడదనే ఉద్ధేశంతో అధికార పార్టీ సభ్యులు ప్రతి విమర్శలు చేయకుండా మౌనంగా ఉన్నారు. ఎట్టకేలకు సాయంత్రం 5 గంటలకు బిల్లులపై సభ్యుల ప్రసంగాలు పూర్తయ్యాయి. దాంతో ప్రభుత్వం తరఫున మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ సమాధానం ఇచ్చి బిల్లులను ఆమోదించాలని కోరారు. దాంతో ఓటింగ్‌ నిర్వహించి సభ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అంతా భావించారు.  
 
సెలెక్ట్‌ కమిటీ పేరుతో టీడీపీ తొండాట  
చర్చ అనంతరం టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు లేచి తమ రాజకీయ కుతంత్రానికి తెరతీశారు. బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా ముందు సెలెక్ట్‌ కమిటీకి నివేదించాలని సభాపతి స్థానంలో ఉన్న వైస్‌ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యంను కోరారు. దీనిపై తాను కాదు.. చైర్మన్‌ షరీఫ్‌ వచ్చి నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆ తర్వాత కాసేపటికి చైర్మన్‌ షరీఫ్‌ సభాపతి స్థానంలో ఆశీనులయ్యారు. యనమల తన వితండవాదాన్ని కొనసాగిస్తూ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలని పట్టుబట్టారు. దీనిపై అధికార పక్ష సభ్యులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. బిల్లులపై ప్రతిపక్షం సవరణలను ఇవ్వనందున 143 నిబంధన ప్రకారం సెలెక్ట్‌  కమిటీకి నివేదించడానికి వీలు లేదని చెప్పారు. 142 నిబంధనకు కొనసాగింపుగానే 143 నిబంధనలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని వివరించారు.

అందుకు యమమల రామకృష్ణుడు విభేదించడంతో సభలో కాసేపు అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. పీడీఎఫ్‌ సభ్యుడు బాలసుబ్రహ్మణ్యం జోక్యం చేసుకుని ప్రతిపక్షం సవరణలు ప్రతిపాదించనందున బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి నివేదించాల్సిన అవసరం లేదని నిబంధనలను ఉటంకిస్తూ వివరించారు. కానీ లోకేశ్, దీపక్‌రెడ్డిలతోపాటు ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ఏమాత్రం సమ్మతించకుండా సభలో తీవ్ర స్థాయిలో గందరగోళం సృష్టించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ తదితరులు ఆ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించడం నిబంధనలకు విరుద్ధమని రూల్‌ బుక్‌లోని నిబంధనలను వివరించారు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్యవాగ్వాదం చోటుచేసుకోవడంతో చైర్మన్‌ షరీఫ్‌ సభను వాయిదా వేశారు.  
 
గంటన్నరపాటు చైర్మన్‌ చాంబర్‌లో చర్చలు 

సభ వాయిదా పడిన తరువాత దాదాపు గంటన్నరపాటు ఉత్కంఠత కొనసాగింది. అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లు చైర్మన్‌ షరీఫ్‌ను ఆయన చాంబర్‌లో కలిసి మాట్లాడారు. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపడం సరికాదని వైఎస్సార్‌సీపీ పక్ష నేత, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ తదితరులు రూల్‌ బుక్‌లోని నిబంధనలను వివరించారు. బీజేపీ, పీడీఎఫ్‌ సభ్యులు కూడా చైర్మన్‌ను కలిసి బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి నివేదించాలన్న టీడీపీ వాదన నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పారు.

ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన బిల్లు అంశంలో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు మెజార్టీ ఇచ్చి ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం తీసుకునే విధాన నిర్ణయాలను శాసనమండలి అడ్డుకోవడం సరికాదని సీనియర్‌ సభ్యుడు కంతేటి సత్యనారాయణ రాజు కూడా విస్పష్టంగా చెప్పారు. కాగా, టీడీపీ సభ్యులు మాత్రం చైర్మన్‌ షరీఫ్‌ మీద ఒత్తిడి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. టీడీపీ మినహా ఇతర పార్టీల సభ్యులు అందరూ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించడం నిబంధనలకు విరుద్ధమని చెప్పిన వాదనతో షరీఫ్‌ ఏకీభవించినట్టు కనిపించారు. ప్రభుత్వం తన విధానాలను అమలు చేయడానికి శాసనమండలి తరఫున సహకరిస్తానని ఆయన చెప్పినట్లు తెలిసింది.  
 
నిబంధనలకు విరుద్ధం.. అంటూనే.. 
దాదాపు రెండు గంటల తరువాత శాసన మండలి సమావేశం కాగానే అంతటా ఉత్కంఠ నెలకొంది. సభలో దాదాపు చీమ చిటుక్కుమన్నా వినిపించేత నిశ్శబ్దం నెలకొంది. చైర్మన్‌ ఏం చెబుతారోనని అంతా ఆసక్తిగా చూశారు. చైర్మన్‌ షరీఫ్‌ నెమ్మదిగా తాను రాసుకువచ్చిన ఉపన్యాసాన్ని చదవడం ప్రారంభించారు. ‘బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని కోరడంలో టీడీపీ నిబంధనలను అతిక్రమించింది. బిల్లులపై టీడీపీ సకాలంలో సవరణలు అందలేదు. కాలాతీతం అయ్యింది. దాంతో బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని టీడీపీ అడగటం తప్పే. బీజేపీ, పీడీఎఫ్‌ సభ్యులు కూడా అదే విషయం చెప్పారు. సెలెక్ట్‌ కమిటీకి పంపించాలన్న టీడీపీ వాదన నిబంధనల ప్రకారం లేదని స్పష్టమైంది. దాంతో సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో నిబంధనలను పాటించాలి. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించే పరిస్థితి లేదు. కానీ చైర్మన్‌గా నాకున్న విచక్షణాధికారాలతో బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి  పంపుతున్నా’ అని ప్రకటించడంతో సభ ఒక్కసారిగా నివ్వెరపోయింది. అధికార పార్టీ సభ్యులు చైర్మన్‌ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. పోడియం చుట్టిముట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. నిబంధనలకు మేరకు వ్యవహరిస్తానని చెప్పి ఇలా మోసం చేయడం ఏమిటని మంత్రులు చైర్మన్‌ షరీఫ్‌ను ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి సహకరిస్తామన్న మీరు ఇలా చేయడం న్యాయమా.. అని నిలదీశారు. కానీ చైర్మన్‌ షరీఫ్‌ ఏమీ స్పందించకుండా మౌనం దాల్చడం గమనార్హం. బీజేపీ, పీడీఎఫ్‌ సభ్యులు కూడా స్పీకర్‌ నిర్ణయంతో విస్తుపోయారు. కాగా ప్రతిపక్ష టీడీపీ సభ్యులు చైర్మన్‌ పోడియం మీదకు చేరి వైఎస్సార్‌సీపీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఆ వెంటనే వ్యూహాత్మకంగా చైర్మన్‌ చుట్టూ చేరి షరీఫ్‌ను వెంటనే అక్కడ నుంచి చాంబర్‌లోకి తీసుకుపోయారు.  

లోకేష్‌ వీడియో చిత్రీకరణ 
టీడీపీ సభ్యుడు లోకేశ్‌ శాసనమండలిలో గందరగోళాన్ని తన సెల్‌ఫోన్‌తో వీడియో తీయడం విస్మయానికి గురిచేసింది. నిబంధనల మేరకు సభలో ఫొటోలు, వీడియోలు తీయకూడదు. కానీ లోకేశ్‌ మాత్రం దాదాపు 15 నిముషాలపాటు వీడియో తీశారు. దీన్ని గమనించిన మంత్రులు పేర్ని నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆయన వద్దకు వెళ్లి అభ్యంతరం తెలిపారు. కానీ లోకేశ్‌ ఏమీ పట్టించుకోకుండా వీడియో తీశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ సభ్యులు ఫిర్యాదు చేయాలని నిర్ణయిండంతో ఆయన వెంటనే సభ నుంచి బయటకు జారుకున్నారు.  

నాడు–నేడు.. ఇదే తీరు 
చంద్రబాబు, యనమల రామకృష్ణుడు.. తమ రాజకీయ స్వార్థం కోసం రాజ్యాంగాన్ని కాలరాయడంలో ఆరితేరిన ద్వయం. నాడు, నేడు.. ఎప్పుడూ వీరిద్దరి తీరు ఇంతే. 1995లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును కుట్ర పూరితంగా కూలదోయడంలో చంద్రబాబు కుతంత్రానికి ఆనాడు స్పీకర్‌గా ఉన్న యనమల రామకృష్ణుడు పూర్తిగా సహకరించిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై ఎన్టీ రామారావు అప్పట్లో ఎంతగా అభ్యంతరం తెలిపినప్పటికీ ఫలితం లేకపోయింది. తాజాగా గ్యాలరీ నుంచి చంద్రబాబు సూచనలు, సైగలు చేస్తూ.. యనమల ద్వారా శాసనమండలిలో చైర్మన్‌ షరీఫ్‌ను ప్రభావితం చేసేలా తతంగాన్ని నెరిపి రాజ్యాంగాన్ని కాలరాశారని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఆలస్యం చేయగలరే గానీ ఆపలేరు
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ శాసనమండలి చైర్మన్‌ తీసుకున్న నిర్ణయం వల్ల బిల్లులు తాత్కాలికంగా ఆగుతాయేమో కానీ పూర్తిగా ఆపలేరు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది కూడా ఏమీ లేదు. నిర్ణీత సమయం తర్వాత ప్రభుత్వం తిరిగి ఈ బిల్లులను పాస్‌ చేయించుకుంటుంది. ప్రతిపక్ష పార్టీ నిర్ణయం కాలయాపనకు ఉపయోగపడుతుందే తప్ప ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేందుకు పనికిరాదు. సెలెక్ట్‌ కమిటీని ఎవరితో ఎలా నియమిస్తారో, విధివిధానాలేమిటో చూడాల్సి ఉంది. 
– ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు 

శాసనసభకే అధికారాలు ఎక్కువ
శాసనమండలి, శాసనసభ రెండూ చట్ట సభలే. దేని అధికారాలు దానికున్నప్పటికీ శాసనసభకు అధికారాలు ఎక్కువ. వాటిని ఉపయోగించుకుని మళ్లీ బిల్లును ఆమోదించి శాసనమండలికి సిఫార్సు చేస్తే అనివార్యంగా ఆమోదించాలి. ఇప్పుడు  జాప్యం చేయవచ్చునేమో గానీ బిల్లుల్ని ఆపడం కుదరదు.                                      
–మాడభూషి శ్రీధర్‌

ఉభయ సభలను కలిపి సమావేశపరిచి మెజార్టీ తీసుకోవచ్చు
రాజధాని వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది, శాసనమండలిలో ఆమోదం పొందకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా అందులో మెజార్టీ తీసుకునేందుకు వీలుంది. సభా సంప్రదాయాల వ్యవహారాల్లో ఉభయ సభలను కలపి నిర్వహించే సంస్కృతి ఉంది. పార్లమెంటరీ సమావేశాల మాదిరిగానే ఇక్కడా చేయడానికి అవకాశం ఉంది. ప్రత్యేక పరిస్థితిలో అధికారపార్టీ తన మెజార్టీతో ఏదైనా చేయవచ్చు.
– మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి

మండలి నిర్ణయమేదైనా అసెంబ్లీ ఆమోదం పొందాలి
‘శాసన మండలి పరిధి సూచనలు ఇవ్వడం వరకే. ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభే సర్వాధికారాలు కలిగి ఉంటుంది. శాసనసభ నిర్ణయాన్ని పెద్దల సభకు పంపాక సభ్యులు చర్చించి సూచనలు, సలహాలతో మళ్లీ అసెంబ్లీకి పంపాలి. దానిపై మళ్లీ చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకొనే రాజ్యాంగపరమైన హక్కు శాసనసభకే ఉంది. ప్రస్తుత బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు మండలి చైర్మన్‌ తీసుకున్న నిర్ణయాన్ని శాసనసభ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ శాసనసభ ఆమోదించకపోతే శాసనసభ అంతకు ముందు ఏ బిల్లు పంపిందో అదే ఫైనలైజ్‌ అవుతుంది. మండలి తీసుకున్న నిర్ణయాన్ని శాసనసభకు పంపించాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి. బిల్లును ఆమోదించినా, వ్యతిరేకించినా, సెలెక్ట్‌ కమిటీకి పంపించినా ఏదైనా సరే శాసనసభకు విధిగా తెలియచేయాలి’
– కె.సురేష్‌రెడ్డి, ఉమ్మడి ఏపీ శాసనసభ మాజీ స్పీకర్‌

మండలి చైర్మన్‌ తీరు సరికాదు
రెండు ప్రధాన బిల్లులపై శాసనమండలి చైర్మన్‌ వ్యవహరించిన తీరు సరికాదు. ప్రొసీజర్‌ ప్రకారం ప్రతిపక్షం వ్యవహరించలేదని ఆయనే చెప్పి విచక్షణాధికారం ప్రకారం టీడీపీ కోరినట్టే సెలెక్ట్‌ కమిటీకి పంపడం సరికాదు. సభ రాజకీయంగా జరుగుతోందన్న సంకేతాలిచ్చినట్టు అయ్యింది. అట్లా సభ జరపడం మంచిది కాదు. పీడీఎఫ్, బీజేపీ ఎమ్మెల్సీలం మధ్యవర్తిత్వం వహించి, అధికార, ప్రతిపక్షాలను ఒప్పించి.. నిబంధనలకు అనగుణంగా వ్యవహరించాలని చైర్మన్‌ను కోరాం. కౌన్సిల్‌ బుక్‌లో ఏముందో చూడమన్నాం. రికార్డులను పరిశీలించాలని కోరాం. అయినా రూల్‌ ప్రకారం జరగలేదని అంటూనే ఇంత కీలకమైన బిల్లుల విషయంలో చైర్మన్‌ ఇలా విచక్షణాధికారం ఉపయోగించడం సరికాదు. మంచి సంప్రదాయం కాదు. రూల్‌ను విస్మరించి విచక్షణాధికారం సంప్రదాయంగా మారకూడదు. 
– విఠపు బాలసుబ్రమణ్యం, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ

మండలి చైర్మన్‌ తీరుతో రాజ్యాంగ సంక్షోభం  
మండలిలో బుధవారం చోటు చేసుకున్న ఘటనల వల్ల రాజ్యాంగానికి విఘాతం కలిగిందని భావిస్తున్నా. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలి. తప్పు చేస్తున్నానని ప్రకటించి చైర్మన్‌ విచక్షణాధికారాన్ని వినియోగించుకోవడం ద్వారా తీవ్ర రాజ్యాంగ సంక్షోభం నెలకొనే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్‌కు తెలియచేశాం. ఇది రూల్‌ ప్రకారం లేదు.  అధికారం ఉన్న వారంతా ఇలాగే వ్యవహరిస్తే రాజ్యాంగబద్ధమైన వేదికల విలువ పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని రకాలుగా సభా మర్యాదల ఉల్లంఘన జరిగింది’  
– పీవీఎన్‌ మాధవ్, మండలిలో బీజేపీ పక్ష నేత  

విచక్షణాధికారాలపై చర్చ జరగాలి
తప్పు చేశాను అంటూనే.. బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్నవారు విచక్షణాధికారాలు వినియోగించడంపై ఇప్పుడు ప్రధానంగా చర్చ జరగాలి. శాసన మండలిలో చైర్మన్‌ తప్పు చేశాను అంటూ విచక్షణాధికారం ఉపయోగించుకుంటున్నట్టు ప్రకటించి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై తదుపరి చర్యలు తీసుకునే దానిపై అధికారంలో ఉన్నవారు దృష్టి పెట్టాలి. శాసన మండలిలో జరిగిన ఈ ఘటన నా మనస్సుకు బాధ కలిగించింది.  
– సోము వీర్రాజు, బీజేపీ ఎమ్మెల్సీ 

రూల్‌ ప్రకారం లేదు..
 ‘నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం వల్ల రెండు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపే పరిస్థితి లేదు.. సవరణలు, సెలెక్ట్‌ కమిటీకి పంపే అంశాలు నిబంధనల ప్రకారం లేవని స్పష్టంగా కనబడుతోంది. ఏదైనా బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత సవరణ తీర్మానం, సెలెక్ట్‌ కమిటీ ఆలోచన 12 గంటల్లోపు ఇవ్వాలి. కానీ సెలెక్ట్‌ కమిటీ కావాలంటూ లెటర్‌ ఇచ్చిన పార్టీ ఆలస్యంగా ఇచ్చింది. ఏదైతే రూలు ఉందో దాని ప్రకారం జరగలేదు. అయినా చైర్మన్‌గా నాకున్న విచక్షణాధికారాలతో ఈ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నా’ అని శాసన మండలి ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ సభలో ప్రకటించారు.

వాయిదా అనంతరం బుధవారం రాత్రి శాసన మండలి తిరిగి సమావేశమయ్యాక ఆయన మాట్లాడుతూ.. ‘బిల్లుల కోసం ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, బీఏసీలో అజెండా నిర్ణయించుకున్న తర్వాత అనుకోకుండా 71వ నిబంధన అంశం ముందుకు వచ్చింది. ఈరోజు చర్చ జరిగిన తర్వాత ప్రతిపక్ష నేత సవరణల మీద కాకుండా సెలెక్ట్‌ కమిటీ కోసం అడిగారు. అది రూలు ప్రకారం లేదు, ఇన్‌టైమ్‌లో రాలేదు, మోషన్‌ అడాప్ట్‌ కాలేదు, సాంకేతికంగా జరగాల్సినవి జరగలేదు. సవరణలు, సెలెక్ట్‌ కమిటీకి పంపే అంశాలు నిబంధనల ప్రకారం రికార్డుల్లోకి రాలేదు. దీనిపై రెండున్నర గంటలపాటు పార్టీల వారీగా, ఫ్లోర్‌లీడర్లతోనూ మాట్లాడాను’ అని షరీఫ్‌ పేర్కొన్నారు.  

నిబంధనల ప్రకారం లేవు: చైర్మన్‌ 
‘ఈ పొరపాటు ఎలా జరిగిందో జరిగిపోయింది. నిబంధనల ప్రకారం సభ ముందుకు రాని సవరణలు, సెలెక్ట్‌ కమిటీకి పంపాలనే అంశాలను పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వం, పీడీఎఫ్, బీజేపీ నాయకులు చెప్పారు. ఈ పరిస్థితుల్లో రూల్‌ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నా పొరపాటు జరిగింది. అయినా దీనిపై రూలింగ్‌ ఎలా ఇవ్వాలా అని ఆలోచించాను. ఇక కాలయాపన చేయడం సరికాదని నా ఉద్దేశం. ఏది ఏమైనప్పటికీ 154వ నిబంధన ప్రకారం నాకున్న విచక్షణాధికారాలకు లోబడి ఈ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నా’ అని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement