సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల రెండోవారంలో... అదీ పదో తేదీలోపే రాష్ట్ర ప్రభుత్వం రద్దయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఏడాది మార్చి తర్వాత ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 10లోపు సభను రద్దు చేస్తేనే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ రెండో వారంలో ప్రభుత్వ రద్దు సిఫారసు ఉంటుందని తెలుస్తోంది. అంతకంటే ముందే ఓసారి అసెంబ్లీని సమావేశపరిచి ఈ విషయంలోనూ సాంకేతిక ఇబ్బందులు రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారని, ఖచ్చితంగా ముందస్తుకు వెళ్లాలనుకుంటే మాత్రం సెప్టెంబర్‌లో ఈ రెండు పరిణామాలు జరుగుతాయని రాజకీయ పరిశీలకులంటున్నారు. లోక్‌సభ ఎన్నికలతో కాకుండా ఆ నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. రాజ్యాంగ నిబంధనల అవరోధాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల సంఘం కోర్టులోకి...!
రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలను కోరుకునే నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం కీలకం కానుంది. రాజ్యాంగ నిబంధనలు, కొన్ని సందర్భాల్లో వచ్చిన కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుని ఈసీ ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తుకు వెళ్లాలనుకుంటే ఈసీ నుంచి ప్రతికూల నిర్ణయం రాకుండా ఏం చేయాలన్న దానిపై తీవ్ర కసరత్తే జరుగుతోంది. ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత కూడా ముందస్తు ఎన్నికలకు అనుమతి ఇవ్వకుండా సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే నష్టం కలుగుతుందనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. దీంతో ప్రభుత్వాన్ని రద్దు చేస్తే మాత్రం ఆ నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలా ఈసీ కోర్టులోకి బంతిని నెట్టే వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం. ఈ విషయంలో ముఖ్యంగా రెండు అవరోధాలను అధిగమించాల్సి ఉంటుందని, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలి అనుకుంటే ఏ నిర్ణయమైనా సెప్టెంబర్10లోపే ఉంటుందని టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ విషయాల్లోనే కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఇతర రాజకీయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారని చెప్పారు. ఇవే అంశాలను ప్రధానితో జరిగిన భేటీలోనూ కేసీఆర్ ప్రస్తావించి ముందస్తుకు వెళ్లడం ద్వారా జరిగే రాజకీయ ప్రయోజనాలను వివరించినట్టు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికలు తప్పించుకునేదెలా..?
వాస్తవానికి, 2014 సార్వత్రిక ఎన్నికలు ఆ ఏడాది ఏప్రిల్ 7 నుంచి మే 12 మధ్య తొమ్మిది దశల్లో జరిగాయి. రాష్ట్రం అధికారికంగా ఏర్పాటు కాకపోవడంతో ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో ఏప్రిల్ 30న, ఆంధ్రప్రదేశ్‌లో మే7న ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆ ఏడాది మార్చి5న ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే, ఆ ఎన్నికలలో తొలివిడత ఎన్నికలు జరిగిన నాటికి నెలరోజుల ముందు మాత్రమే షెడ్యూల్ విడుదల కాగా, కొన్ని సందర్భాల్లో 45–60 రోజుల ముందే వెలువడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎప్పుడైనా సార్వత్రిక షెడ్యూల్ విడుదల చేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. ఈ లోపు ప్రభుత్వం రద్దయి 6 నెలలు పూర్తయ్యే పక్షంలో సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఖచ్చితంగా తెలంగాణ శాసనసభకు ఆలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే... ఫిబ్రవరి లేదా మార్చిలో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చే ముందే తెలంగాణ ప్రభుత్వం రద్దయి 6 నెలలు దాటిపోయే పక్షంలో సార్వత్రిక ఎన్నికలతో కాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. షెడ్యూల్ ప్రకారం ఈ రాష్ట్రాలకు డిసెంబర్ 15లోపు ఎన్నికలు నిర్వహించాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని సెప్టెంబర్ 10లోపు రద్దు చేస్తే ఎన్నికల నిర్వహణకు గాను ఈసీకి అవసరమైన 90–100 రోజుల గడువు కూడా లభించనుంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా సెప్టెంబర్ 10లోపు ప్రభుత్వ రద్దు సిఫారసును గవర్నర్‌కు కేసీఆర్ పంపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసెంబ్లీ భేటీ జరగాలా..?
ఇక, రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం.. అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ఆరు నెలల గరిష్ట కాలపరిమితి మాత్రమే ఉంది. వాస్తవానికి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ ఏడాది మార్చి 13 నుంచి 29 వరకు జరిగాయి. అయితే, అసెంబ్లీని గవర్నర్ ప్రోరోగ్ చేసింది మాత్రం జూన్1న. అంటే మార్చి 29 నుంచి 6 నెలల్లోపు అసెంబ్లీ మరోసారి సమావేశం కావాలా? లేక జూన్ 1 నుంచి 6 నెలల్లోపా? అన్నది గందరగోళానికి గురిచేస్తోంది. దీనిపై నిపుణులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నా మార్చి 29ని పరిగణనలోకి తీసుకుంటే సెప్టెంబర్ 28 కల్లా అసెంబ్లీ మరోసారి భేటీ కావాల్సిందే. అదే ప్రోరోగ్ చేసిన జూన్1ని పరిగణనలోకి తీసుకుంటే నవంబర్ 30 కల్లా సమావేశం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వాన్ని సెప్టెంబర్ 10లోపు రద్దు చేయాలనుకుంటే ఆ లోపు మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ఈ రెండింటికీ పరిష్కారం లభించనుంది. సెప్టెంబర్‌లో అసెంబ్లీ నిర్వహిస్తే మార్చి వరకు మళ్లీ ఇబ్బంది ఉండదు. ఈలోపు ఆ నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. అప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాల్సిన అవసరమూ ఉండదు. ఈ కోణంలోనే సెప్టెంబర్ తొలి వారంలో రెండు లేదా మూడు రోజులు సభ నిర్వహించి ప్రజలకు చెప్పాల్సిన విషయాలను అసెంబ్లీ వేదికగా వెల్లడించి ఆ తర్వాత రద్దు చేస్తే ఎలాంటి సమస్య ఉండదని నిపుణులు కేసీఆర్‌కు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోమారు అసెంబ్లీని సమావేశపర్చిన తర్వాతే ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని తెలుస్తోంది. ఈ 2 ప్రధాన అంశాలతో పాటు ఇతర రాజ్యాంగ అవరోధాలు లేకుండా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలని, ఎన్నికల నిర్వహణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసీ పీఠముడి వేయకుండా మరింత లోతుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో పాటు అవసరమైతే మరోమారు ఈసీ వర్గాలతోనూ చర్చలు జరిపే యోచనలో కేసీఆర్ ఉన్నారని, అన్ని విషయాల్లో స్పష్టత వచ్చిన తర్వాతే ప్రభుత్వ రద్దుకు నిర్ణయం తీసుకుంటారని, రద్దు చేయాలని నిర్ణయిస్తే మాత్రం సెప్టెంబర్ 10లోపే క్రతువు పూర్తి చేస్తారని సమాచారం.
సెప్టెంబర్ 10లోపే ప్రభుత్వ రద్దు యోచన
Published Mon, Aug 27 2018 2:26 AM | Last Updated on Mon, Aug 27 2018 1:31 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment