
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రిమండలి సమావేశంలో ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో తన అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ భేటీలో అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మంత్రులంతా ఆమోదం తెలిపినట్టు సమాచారం. శాసనసభ రద్దు సిఫారసుకు సంబంధించిన తీర్మానంపై మంత్రుల సంతకాలు తీసుకున్నారు.
మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిసి కేబినెట్ తీర్మానం కాపీని అందజేశారు. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించే విలేకరుల సమావేశంలో కేబినెట్ నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ అధికారికంగా వెలువరించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను కూడా ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు.
అంతకుముందు రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. శాసనసభను రద్దు చేయడానికి రంగం సిద్ధం చేసిన సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ముందే సిద్ధం చేసుకున్న ఏకవాక్య తీర్మానాన్ని మంత్రుల ముందుంచారు. అసెంబ్లీ రద్దు అధికారాన్ని అంతకుముందే కేసీఆర్‌కు కట్టబెట్టిన మంత్రులు తీర్మానంపై వెంటనే సంతకాలు చేశారు. అరగంటలో కేబినెట్ భేటీ ముగిసింది. తీర్మానం కాపీని తీసుకుని మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌కు వెళ్లారు. కేబినెట్ తీర్మానం కాపీని గవర్నర్ నరసింహన్‌కు అందజేశారు. అసెంబ్లీ రద్దు గురించి ఆయనకు నివేదించారు. కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించారు. అసెంబ్లీని రద్దు చేస్తూ రాజ్‌భవన్ ప్రకటన ఇవ్వనుంది. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి, అసెంబ్లీ కార్యదర్శికి పంపనున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరపాలనే దానిపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కేసీఆర్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment