
సాక్షి, న్యూఢిల్లీ : బద్ధ విరోధి అయిన టీడీపీతో పొత్తుకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ-కాంగ్రెస్ చేతులు కలుపడం ప్రతికూల సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళుతుందని కాంగ్రెస్ నేతలు మథన పడుతున్నారు. టీడీపీతో పొత్తు ఇబ్బందికర పరిణామమేనని టీ కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ ఢిల్లీలో అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో గత 30 ఏళ్లుగా టీడీపీతోనే కాంగ్రెస్ కార్యకర్తలు తలపడ్డారని, ఇప్పుడు టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ కావడం అంత సులభం కాదని ఆమె అన్నారు. గెలువగలిగే స్థానాల్లోనే టీడీపీ వారికి సీట్లు ఇవ్వాలని ఆమె సూచించారు. టీడీపీ నేతలు సైతం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తామని, కాంగ్రెస్ టికెట్లు కావాలని కోరుతున్నారని చెప్పారు.
టీడీపీతో పొత్తు లేకపోయినా తాము గెలుస్తామని, మెజారిటీ స్థానాలు సొంతంగా గెలువగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందని మరో నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మునుగోడు అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమవుతున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి తెలియజేసినట్టు చెప్పారు. గెలవగలిగే వారికే టిక్కెట్లు ఇవ్వాలని రాహుల్‌ను కోరానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment