
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై భాగస్వామ్యపక్షాలైన సీపీఐ, తెలంగాణ జన సమితి తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశాయి. తెలంగాణ జన సమితికి 8, సీపీఐకి 3 స్థానాలు కేటాయించినట్లు గురువారం ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడటంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కార్యవర్గం శుక్రవారం అత్యవసరంగా సమా వేశమైంది. కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, మునుగోడు, బెల్లం పల్లి స్థానాల్లో పోటీ చేయాలని తీర్మానించింది. పార్టీ రాష్ట్ర నేత గోద శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. తమకు కేటాయించిన సీట్ల సంఖ్య అవమానకరంగా ఉందని, కేటాయించిన సీట్లు కూడా తాము కోరుకున్నవి కావని భేటీలో పాల్గొన్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు కేటాయించిన సీట్లు ఆమోదయోగ్యమా కాదా అనేది సంప్రదించకుండానే సీట్లను ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ‘రాష్ట్రంలో నియంతృత్వ టీఆర్‌ఎస్‌ను, వారితో లాలూచీ దోస్తీలో ఉన్న బీజేపీని ఓడించే లక్ష్యం నెరవేరాలంటే భాగస్వామ్య పార్టీల మధ్య సుహృద్భావంతో కూడిన విశ్వాసముండాలి. దీనికి భిన్నంగా జరుగుతున్న పరిణామాలకు పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాం. రాజకీయ లక్ష్యం కంటే గ్రూపులను సంతృప్తిపరిచే సంకుచిత ధోరణితో కాంగ్రెస్ వ్యవహరించడం దారుణం’ అని సీపీఐ మండిపడింది. టీఆర్‌ఎస్‌ను ఓడించాలనే ప్రధాన లక్ష్యంతోనే తాము పనిచేస్తామని స్పష్టం చేసింది. అంతకుముందు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం. కోదండరాంతో టీజేఎస్ కార్యాలయంలో చాడ వెంకట్‌రెడ్డి, నేతలు సాంబశివరావు, టి. శ్రీనివాస్‌రావు, పశ్య పద్మ తదితరులు కాసేపు సమావేశమయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ ముఖ్యనేత జానారెడ్డితోనూ సమావేశమయ్యారు.
కూటమిని వీడుదామా...?
కోదండరాంతో జరిగిన భేటీలో కూటమిని వీడి 30 స్థానాల్లో పరస్పర అవగాహనతో పోటీ చేద్దామని సీపీఐ నేతలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను కోదండరాం సున్నితంగా తిరస్కరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పొత్తుల విషయంలో కాంగ్రెస్ తీరు అభ్యంతరకరంగా ఉందని కోదండరాం ఏకీభవించారు. ఎన్నికలు సమీపించిన సమయంలో కూటమిని వీడితే టీఆర్‌ఎస్‌కు ప్రయోజనం చేసినట్లు అవుతుందని కోదండరాం అభిప్రాయపడ్డారు. సీట్ల విషయంలో ఇంకా సమస్యలు ఉన్నాయని, వాటి కోసం అన్ని స్థాయిల్లో ఒత్తిడి తెద్దామని కోదండరాం సూచించారు. దీనికోసం తాను కూడా చొరవ తీసుకుంటానని, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరినట్లు తెలిసింది.