
నిజామాబాద్ ఎంపీపీగా ఎన్నికైన బానావత్ అనుష విజయోత్సాహం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: మండల పరిషత్‌లన్నీ గులాబీమయమయ్యాయి. ప్రాదేశిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ జిల్లాలో 27 మండలాలకు గాను, 24 మండల పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంది. ఒక్క రెంజల్ మండల ఎంపీపీ స్థానాన్ని మాత్రం బీజేపీ దక్కించుకోగలిగింది. బోధన్, చందూరు మండలాల ఎంపీపీ, వైస్‌ఎంపీపీల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు ఒక్క ఎంపీపీ స్థానం కూడా దక్కలేదు. చందూరులో మూడింటిలో రెండు ఎంపీపీ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకున్నప్పటికీ.. బలపరిచే ఎంపీటీసీ లేకపోవడంతో అధికారులు ఈ ఎన్నికను వాయిదా వేశారు.
బోధన్ మండల ఎంపీపీ ఎన్నిక కూడా వాయిదా పడింది. ఈ మండల ఎన్నిక కాస్త వివాదానికి దారితీసింది. ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల4న జరిగింది. జిల్లాలో 299 ఎంపీటీసీ స్థానాలకు గాను 188 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అదే స్థాయిలో 24 ఎంపీపీ పదవులను కైవసం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మోస్తారు 34 స్థానాలు సాధించిన బీజేపీ రెంజల్‌లో ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. 11 ఎంపీటీసీ స్థానాల్లో ఐదు ఎంపీటీసీలు గెలుచుకున్న కమలం పార్టీ స్వతంత్ర ఎంపీటీసీ మద్దతుతో ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోగలిగింది.
కత్తులు దూసుకున్న పార్టీలు కలిశాయి
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కత్తులు దూసుకున్న టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఎంపీపీ ఎన్నికలకు వచ్చే సరికి మిలాఖత్ అయ్యాయి. నవీపేట్ ఎంపీపీ, వైస్‌ఎంపీపీ పదవుల విషయంలో ఈ రెండు పార్టీల ఎంపీటీసీలు చెట్టాపట్టాలేసుకుని పదవులను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. నవీపేట్ మండలంలో 16 ఎంపీటీసీలుండగా, టీఆర్‌ఎస్ ఏడు స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ ఐదు, బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించాయి. ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలిచారు. ఏడు స్థానాలు గెలిచిన టీఆర్‌ఎస్‌కు బీజేపీ ఎంపీటీసీలు మద్దతు ఇవ్వడం గమనార్హం. దీంతో ఎంపీపీ పదవి టీఆర్‌ఎస్‌కు దక్కింది. ఇందుకు గాను బీజేపీకి వైస్ ఎంపీపీ పదవి దక్కింది. వరుస ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు కత్తులు దూసుకున్న ఈ రెండు పార్టీల ఎంపీటీసీలు పదవుల విషయానికి వస్తే మిలాఖత్ అవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఒంటరైన కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ఒక్క ఎంపీపీ పదవి కూడా దక్కలేదు. చందూరులో మూడింటిలో రెండు ఎంపీటీసీలను గెలుచుకున్నప్పటికీ., ఆ ఎ న్నిక కూడా వాయిదా పడింది. దీంతో 45 ఎంపీటీసీలు గెలుచుకున్న హస్తం పార్టీ ఒక్క ఎంపీపీ స్థానాన్ని కూడా దక్కించుకోలేక పోయింది. కాగా ఎడపల్లి ఎంపీపీ స్థానం సాంకేతికంగా కాంగ్రెస్ ఖాతాల్లో పడినప్పటికీ., ఎంపీపీగా ఎన్నికైన ఎంపీటీసీ టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ ఒక్క స్థానం కూడా టీఆర్‌ఎస్ ఖాతాలో పడినట్లయింది.
చందూరు, బోధన్ ఎన్నిక నేటికి వాయిదా..
ముందు ఊహించినట్లుగానే చందూరు, బోధన్ ఎంపీపీ, వైస్‌ఎంపీపీల ఎన్నికలు నేడు జరుగనున్నాయి. చందూరులో మూడు ఎంపీటీసీ స్థానాలకు గాను రెండు ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఒకటి టీఆర్‌ఎస్‌కు దక్కిన విషయం విదితమే. మూడింటిలో రెండు స్థానాలున్న కాంగ్రెస్ ఎంపీపీ పదవి కోసం నామినేషన్ వేయగా, ప్రతిపాదించే ఎంపీటీసీ ఉన్నప్పటికీ, బలపరిచే ఎంపీటీసీ లేకపోవడంతో ఈ ఎన్నికను అధికారులు నిలిపివేశారు. దీంతో కాంగ్రెస్‌కు దక్కుతుందని అనుకున్న ఈ ఒక్క స్థానం కూడా దక్కకుండా పోయింది. బోధన్ ఎన్నిక కూడా వాయిదా పడింది. సరైన కోరం లేదనే కారణంగా అధికారులు ఈ ఎన్నికను నిలిపేశారు. ఈ విషయంలో ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment