జెడ్పీటీసీకి నామినేషన్ వేస్తున్న వెంకటేశ్వరి, పక్కనే మంత్రి శ్రీనివాస్‌గౌడ్
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల దాఖలు చివరిరోజు జోరందుకున్నాయి. ఆదివారం రెండో విడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. రెండో విడతలో 7 జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు గాను జెడ్పీటీసీలకు 53, ఎంపీటీసీ స్థానాలకు 538 నామినేషన్లు వచ్చాయి. తొలి రెండు రోజులు నామినేషన్లు అంతగా వేయలేదు. చివరిరోజు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పోటీపడ్డారు. ఏ నామినేషన్ కేంద్రం చూసినా ఆయా పార్టీల అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడాయి.
మూడు రోజులు ఇలా..
మొదటి రోజు శుక్రవారం నామినేషన్లు పెద్దగా దాఖలు కాలేదు. జెడ్పీటీసీ స్థానాలకు తొలి రోజు 13, ఎంపీటీసీలకు 176 నామినేషన్లు వేశారు. రెండోరోజు శనివారం జెడ్పీటీసీలకు 6, ఎంపీటీసీలకు 66, నామినేషన్లు వచ్చాయి. మూడో రోజు జెడ్పీటీసీలకు 34, ఎంపీటీసీలకు 296 నామినేషన్లు దాఖలు చేశారు.
కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం
ఎన్నికల పోటీ ఖర్చు తడిసి మోపెడయ్యే అవకాశాలు ఉండడంతో అభ్యర్థులు పోటీలో ఉండకుండా ప్రత్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు. నామినేషన్ల పర్వం ప్రారంభానికి ముందే తమ ప్రత్యేర్థులెవరో తెలుసుకుని ముందుకుపోయారు. వారి వద్దకు వెళ్లి పోటీ నుంచి తప్పుకోవాలని వేడుకుంటున్నారు. ఇవి పార్టీ పరంగా జరిగే ఎన్నికలు కావడంతో పోటీదారులను బుజ్జగించడం రాజకీయ పార్టీల నాయకులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఒక ఎంపీటీసీ స్థానం నుంచి ఒకే పార్టీకి చెందిన నలుగురైదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఆయా పార్టీ నేతలు వారిని సుముదాయించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు çఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.
మే 2 వరకు గడువు
రెండో విడత నామినేషన్ల దాఖలుకు ఆదివారంతో తెర పడింది. ఇక 29వ తేదీన వచ్చిన నామినేషన్లను పరిశీలిస్తారు. 30న తిరస్కరణ, మే 2వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ చేపడుతారు. అదేరోజు బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. 10వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment