
ఎంపీ తోటను కలిసిన ఆయన వర్గీయులు
తూర్పుగోదావరి, కిర్లంపూడి (జగ్గంపేట): కాకినాడ ఎంపీ తోట నరసింహం జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై తాడోపేడో తేల్చుకోవడానికి ఎంపీ తోట వర్గం సిద్ధమవుతోంది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును మంగళవారం కలిసి జగ్గంపేట అసెంబ్లీ సీటు సాధించేందుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎంపీ తోట వర్గం గట్టిగా పట్టుబడుతోంది. దీంతో ఆరు నూరైనా నూరు ఆరైనా అక్కడి నుంచే అసెంబ్లీకి పోటీ చేయాలని ఎంపీ తోట ఒక నిర్ణయానికి వచ్చారు. ఈమేరకు శనివారం రాత్రి నియోజకవర్గం నలుమూలల నుంచీ వచ్చిన తన అనుచరులు, కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కిర్లంపూడి, జగ్గంపేట, గోకవరం మండలాలకు చెందిన ఆయన వర్గీయులు ఈ సందర్భంగా తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఆదివారం కూడా అధిక సంఖ్యలో తోట వర్గీయులు వీరవరం చేరుకుని తమ మనోగతం చెప్పారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో జగ్గంపేట నియోజకవర్గంలోని అసలైన టీడీపీ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వేరే పార్టీ నుంచి వచ్చినవారు ఈ నియోజకవర్గాన్ని శాసిస్తున్నారని, నిజమైన కార్యకర్తలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివ్వడం లేదని, పైగా అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఎంపీ తోట వద్ద వాపోయారు. ఇప్పటికైనా మేల్కోకపోతే 2014 ఎన్నికల సమయంలో టీడీపీ జెండా మోసిన అసలైన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తోటపై వారు ఒత్తిడి తెచ్చారు. దీనిపై ఎంపీ తోట స్పందిస్తూ ప్రాణం ఉన్నంత వరకూ జగ్గంపేట నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, తన ఆరోగ్యం సహకరించకపోతే తన భార్య వాణి పోటీ చేస్తుందని కార్యకర్తలకు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తనకు అపార నమ్మ కం ఉందని, జగ్గంపేట టీడీపీ టిక్కెట్టు తమ కుటుంబానికే కేటాయిస్తారని ఆశిస్తున్నానని, ఈమేరకు అసలైన కార్యకర్తలందరూ విజయవాడ వెళ్లేందుకు సిద్ధమవ్వాలని సూచించా రు. కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment