న్యూయార్క్ / న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగింపుదశకు చేరుకున్న వేళ ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ ప్రధాని మోదీపై సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత విభజన సారథి(ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్) అనే వివాదాస్పద శీర్షికతో మోదీ చిత్రాన్ని కవర్‌పేజీపై ముద్రించింది. 2014లో ఉజ్వలమైన భవిష్యత్‌పై ఆశలు కల్పిస్తూ అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పుడు ఓ సగటు రాజకీయ నేతగా మిగిలిపోయారంది. ఈ కథనాన్ని ప్రముఖ భారత జర్నలిస్ట్ తవ్లీన్ సింగ్ కొడుకు అతీశ్ తసీర్ రాశారు. యూరప్, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ పసిఫిక్ అంతర్జాతీయ ఎడిషన్లలో మోదీ ముఖచిత్రంతో టైమ్ మ్యాగజీన్ ప్రధాన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనమున్న ప్రతి 2019, మే 20న ప్రజలకు అందుబాటులోకి రానుంది.
హామీల అమలులో విఫలం..
భారత్ మరో ఐదేళ్ల పాటు మోదీ ప్రభుత్వాన్ని భరించగలదా? అని తసీర్ తన కథనంలో ప్రశ్నించారు. ‘2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మోదీ సమాజంలోని విభేదాలను సద్వినియోగం చేసుకుని అధికారంలోకి వచ్చారు. తాజాగా 2019 ఎన్నికల్లో అవే పరిస్థితులను భరిస్తూ తనకు ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. ఓవైపు హిందువులకు పూర్వవైభవం, మరోవైపు దక్షిణకొరియా అభివృద్ధి మోడల్‌తో భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందన్న హామీతో మోదీ అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని ఓ సగటు రాజకీయ నేతగా మిగిలిపోయారు. 2014లో ప్రజల సాంస్కృతిక ఆగ్రహాన్ని ఆర్థికరంగంవైపు మళ్లించగలగడంలో మోదీ విజయవంతం అయ్యారు.
అప్పుడు ఉద్యోగాలు, అభివృద్ధి గురించే ఆయన మాట్లాడేవారు. వ్యాపారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని చెప్పేవారు. కానీ మోదీ ఆర్థిక ప్రణాళికలు కార్యరూపం దాల్చడంలో విఫలమయ్యాయి. ఆయన చర్యలు దేశంలో విద్వేషపూరిత మత జాతీయవాదానికి బీజం వేశాయి’ అని మండిపడ్డారు. ‘134 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రచారం కోసం సోదరి ప్రియాంకను రంగంలోకి దించింది. ఇది అమెరికాలో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి హిల్లరీ క్లింటన్, ఉపాధ్యక్ష పదవికి ఆమె కుమార్తె చెల్సియా పోటీపడటం లాంటిదే. బలహీన ప్రతిపక్షం ఉండటం మోదీ అదృష్టమే. మోదీని ఓడించడం తప్ప వీరికి మరో అజెండా లేదు’ అని విమర్శించారు.
మోదీకి ప్రత్యామ్నాయం లేదు..
భారత్‌లో ఆర్థిక సంస్కరణలు కొనసాగాలంటే మోదీనే సరైన వ్యక్తి అని యూరేసియా గ్రూప్ అధ్యక్షుడు ఇయాన్ బ్రెమ్మర్ అభిప్రాయపడ్డారు. ‘ఇండియాలో ఇంకా సంస్కరణలు కొనసాగాల్సిన అవసరం ఉంది. ఇతర నేతలతో పోలిస్తే మోదీనే ఈ సంస్కరణలను సమర్థవంతంగా చేపట్టగలరు. ఆయన హయాంలోనే చైనా, అమెరికా, జపాన్‌తో భారత ద్వైపాక్షిక సంబంధాలు మెరుగయ్యాయి. మోదీ విధానాల కారణంగా భారత్‌లో కోట్లాది మంది ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయి. ఆధార్ బయోమెట్రిక్ విధానాన్ని విస్తరించడం వల్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం తగ్గింది. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించే తత్వం మోదీది. అదే సమయంలో భారత్ లో అవసరమైన సంస్కరణలు చేపడ్డటంలో మోదీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. దీటైన ప్రత్యామ్నాయం లేకపోవడం మోదీ పాలిట వరంగా మారింది’ అని బ్రెమ్మర్ విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment