సాక్షి, తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పవన్ ఏ సృహతో రాజకీయాల్లోకి వచ్చారో అర్ధం కావడం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి పవన్ వ్యాఖ్యలు అర్థరహితమని కొట్టిపడేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతుంటే పవన్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేదే పవన్ కల్యాణ్ చేస్తున్నారని విమర్శించారు. చిరంజీవి వల్ల తెచ్చుకున్న పేరు మొత్తం పవన్ చెడగొట్టుకున్నారని పేర్కొన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయ్యంలో సుధాకర్‌బాబు గురువారం మాట్లాడారు.
అప్పుడేం చేశారు..
‘ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి జరిగితే పవన్ ఎందుకు మాట్లాడలేదు. మహిళా ఎమ్మెల్యేపై దాడి జరిగితే ఎందుకు స్పందించలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగితే ఎందుకు నోరు మెదపలేదు. టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్‌సీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్ కల్యాణ్ అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు.
బొండా ఉమా అక్రమాలన్నీ మాతో వస్తే చూపిస్తాం. బొండా ఉమా, బుద్ధా వెంకన్న పలనాడు ప్రాంతానికి వెళ్లి అక్కడి ప్రజలను రెచ్చగొట్టారు. పలనాడులో టీడీపీ నేతలు లేరా? ఆ ఇద్దరినే అక్కడికెందుకు పంపారు. కులాల పేరుతో చిచ్చుపెట్టాలన్నదే చంద్రబాబు కుట్ర. ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన చరిత్ర బోండా ఉమది. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన శాస్తి చేస్తాం’అని సుధాకర్‌బాబు హెచ్చరించారు.
ఎన్ని పదవులిచ్చారు..
అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది దళితులకు పదవులిచ్చావు చంద్రబాబూ? సీఎం వైఎస్ జగన్ ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చారు. ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. రెల్లి, మాల, మాదిగ కార్పొరేషన్ల పదవులు ఇచ్చారు. వీటి గురించి టీడీపీ దళిత నేతలు నోరు విప్పరు. అమ్మ ఒడి, ఇళ్ల పట్టాలు అధికంగా పొందేవారు దళితులే. ఎల్లో మీడియా అవాస్తవాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఓడిపోతామని తెలిసే వర్ల రామయ్యకు చంద్రబాబు రాజ్యసభ సీటు ఇచ్చారని సుధాకర్‌బాబు ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment