చంద్రబాబు యూటర్న్‌ వ్యాఖ్యలపై పవన్‌ మౌనమా? | YSRCP TJR Sudhakar Babu Slams CM Chandrababu Naidu Over Super Six U Turn Comments, See Details | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ‘సూపర్‌ సిక్స్‌’ యూటర్న్‌ వ్యాఖ్యలపై పవన్‌ మౌనమా?

Published Mon, Jul 29 2024 11:52 AM | Last Updated on Mon, Jul 29 2024 2:44 PM

YSRCP TJR Sudhakar Babu Slams CM Chandrababu

ఎన్నికల హామీలన్నీ మర్చిపోయిన చంద్రబాబు

అన్నింటికీ మంగళం. వైట్‌ పేపర్లతో నిందల పర్వం

పేరుకే ఉచిత ఇసుక. గతంలో కంటే ధర అధికం

సంపద సృష్టించడం అంటే, అప్పులు చేయడమా?

:ప్రెస్‌మీట్‌లో సూటిగా ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు

తాడేపల్లి,సాక్షి: తన సుదీర్ఘమైన అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు హామీలపై నాలుక మడతేస్తున్నారని.. దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌  కూడా మౌనంగా ఉండిపోయారని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్ బాబు మండిపడుతున్నారు . సోమవారం ఉదయం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

యథావిథిగా యూటర్న్‌
ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన ‘సూపర్‌సిక్స్‌’పై చంద్రబాబు యథావిథిగా యూటర్న్‌ తీసుకున్నారని, అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే, భయం వేస్తోందంటూ డ్రామాలు ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆ మాట అన్నా.. కూటమి పథకాల గురించి, నాడు గొప్పగా చెప్పిన జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌.. కనీసం నోరు మెదపలేదని ఆయన ఆక్షేపించారు.

టీడీపీ కూటమి ప్రకటించిన పథకాలు అమలు సాధ్యం కాదని, ఎన్నికల ముందు తాము పేర్కొన్నా.. తనకు సంపద సృష్టించడం తెలుసంటూ.. చంద్రబాబు గొప్పలు చెప్పి, ఇప్పుడు కాడి ఎత్తేశారని దుయ్యబట్టారు. సంపద సృష్టించడం అంటే, అప్పులు చేయడమేనా అని నిలదీశారు.

ప్రచార ఆర్భాటం
చంద్రబాబు ప్రతి విషయంలో ప్రచార ఆర్భాటం తప్ప, వాస్తవ అమలు ఏదీ లేదని మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. ఇసుక ఉచితంగా ఇస్తున్నామంటూ, ప్రచారం చేశారని, కానీ.. గతంలో తమ ప్రభుత్వ హయాంలో కంటే, ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారని తెలిపారు.

తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది అమలు చేయడం లేదని, రైతులు ఖరీఫ్‌ సాగు ప్రారంభించినా, వారికి ఇప్పటి వరకు పెట్టుబడి సాయం చేయలేదని, పిల్లలకు ఫీజులు చెల్లించలేదని, చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయం ఇంకా ఇవ్వలేదని.. .. ఇలా అన్ని వర్గాలను టీడీపీ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు.

మాట తప్పడం ఆయన నైజం
చంద్రబాబు తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇచ్చిన మాటకు కట్టుబడలేదని మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు తేల్చి చెప్పారు. మాట తప్పడం చంద్రబాబు నైజం అని ఆయన గుర్తు చేశారు. అందుకు ఈ 50 రోజుల పాలన, మరో ఉదాహరణ అని పేర్కొన్నారు.

కేంద్రం నుంచి సున్నా
ఇప్పుడు టీడీపీ, ఎన్డీఏ కూటమిలో ఉన్నా, ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ప్రస్తావించారు. రాజధాని పనుల కోసం రూ.15 వేల కోట్లు, రుణంగా సమకూరుస్తామని చెబితే, ఆ ని«ధులు సాధించినట్లు గొప్పగా ప్రచారం చేసుకున్నారని గుర్తు చేశారు. మరే విషయంలోనూ కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా, స్పందించడం లేదని ఆక్షేపించారు.

రెడ్‌బుక్‌ రాజ్యాంగం
రాష్ట్రంలో గత 50 రోజులుగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందన్న సుధాకర్‌బాబు, ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే, విపక్షంపై దాడులు మొదలయ్యాయని తెలిపారు. ఆరోజు నుంచి ఇప్పటి వరకు హత్యలు, హత్యా యత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం.. యథేచ్ఛగా సాగుతోందని మాజీ ఎమ్మెల్యే చెప్పారు.

దానర్థం మార్చారు
మరోవైపు శ్వేతపత్రాల పేరుతో పచ్చి అబద్ధాలు చెప్పడం, అన్నింటికీ గత ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తూ నిందించడం, జగన్‌గారిని వ్యక్తిగత హననం చేయడమే సీఎం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని అన్నారు. నిజానికి శ్వేతపత్రం అంటే.. అన్ని వాస్తవ పరిస్థితులు వివరిస్తూ, వాటికి సంబంధించి, భవిష్యత్తులో తామేం చేస్తామన్నది చెప్పడం అని గుర్తు చేసిన సుధాకర్‌బాబు.. ఇప్పుడు సీఎం చంద్రబాబు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడని ఆక్షేపించారు.

ఇకనైనా వైఖరి మార్చుకొండి
చంద్రగిరిలో తమ పార్టీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని భయ భ్రాంతులకు గురిచేసి, ఇబ్బంది పెట్టారని మాజీ ఎమ్మెల్యే చెప్పారు. అసలు ఆయన ఏ నేరం చేశారని, ఎయిర్‌పోర్టులో అదుపులోని తీసుకుని, నానా హంగామా చేసి, ఆ తరవాత నోటీసు ఇచ్చి వదిలారని నిలదీ«శారు.

ప్రభుత్వ పెద్దలు ఇకనైనా వైఖరి మార్చుకోవాలని, కక్ష సాధింపు చర్యలు విడనాడాలని.. దాడులు, హత్యలు, ఆస్తుల విధ్వంసాన్ని ఆపాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని టీజేఆర్‌ సుధాకర్‌బాబు హితవు చెప్పారు. తమను ఎంత వేధించినా, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతామని, ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన తేల్చి చెప్పారు.

రాష్ట్ చరిత్రలో వైఎస్సార్, జగన్ పేరు వింటే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. చంద్రబాబు పేరు వింటే ప్రజలకు వెన్నుపోటు, విధ్ంసం, మోసాలు గుర్తొస్తాయి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట్లాడే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోతే వైసీపి ప్రశ్నిస్తూనే ఉంటుంది’’ అని సుధాకర్‌బాబు అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement