సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం బెంగళూరుకు వెళుతున్నారు. అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడతో, ఆయన కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు.
త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో రాజ కీయ పరిస్థితులు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై అంశాలపై వారితో చర్చించనున్నట్టు సమాచారం. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ బెంగళూరు బయలుదేరనున్నారు. ఆయనతోపాటు పలువురు పార్టీ నేతలు వెళ్లనున్నారు. దేవెగౌడ, కుమారస్వామిలతో భేటీ అనంతరం సాయంత్రం ఆరు గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
వేచి చూడాలనుకున్నా..
దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలతో జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల అధినేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. కోల్‌కతాకు వెళ్లి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ సమావేశమయ్యారు. తాజాగా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో.. ఫ్రంట్ కార్యాచరణపై కొంత వేచి చూడాలని తొలుత కేసీఆర్ భావించారు.
కానీ ఈ వ్యూహాన్ని మార్చుకున్నారని, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించడం ద్వారా ఫెడరల్ ఫ్రంట్‌కు బలాన్ని చేకూర్చవచ్చని కేసీఆర్ భావిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కర్ణాటక అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్(ఎస్) ప్రధానంగా పోటీ పడుతున్నాయి. దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (ఎస్)కు మద్దతును ప్రకటించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ బెంగళూరు పర్యటన పెట్టుకున్నారని తెలుస్తోంది. కర్ణాటక పర్యటన అనంతరం కేసీఆర్ ఒడిశా పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కేసీఆర్‌ది దూరదృష్టి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల సమస్యలపై ఆయనకు స్పష్టత ఉంది’’అని యోగగురు బాబా రాందేవ్ ప్రశంసించారు. ఆర్థికరంగంపై కూడా కేసీఆర్ ఆలోచనల్లో పూర్తి స్పష్టత ఉందని ప్రశంసిస్తూ గురువారం ట్వీట్ చేశారు. అంతకు ముందు గురువారం ప్రగతిభవన్‌లో సీఎంతో బాబారాందేవ్ భేటీ అయ్యా రు. ఆయనకు ముఖ్యమంత్రి ఘనస్వాగతం పలికారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment