‘రాజన్న’ నేలపై రాజెవ్వరు? | Tough fight between TRS and Mahakutami Joint Karimnagar | Sakshi
Sakshi News home page

‘రాజన్న’ నేలపై రాజెవ్వరు?

Published Sun, Nov 25 2018 4:42 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Tough fight between TRS and Mahakutami Joint Karimnagar  - Sakshi

వేములవాడ రాజన్న సన్నిధి.. పుణ్యక్షేత్రాల గడ్డ.. విప్లవ పోరాటాలకు అడ్డా.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా. గోదావరి నీటితో సుస్థిర సాగు, బొగ్గు, గ్రానైట్‌ వనరులతో పారిశ్రామిక వృద్ధి, జీవన ఆ‘దార’మైన సంప్రదాయ వృత్తి చేనేత, బతుకుదెరువుకు గల్ఫ్‌ వలసలు, తాగునీటి తండ్లాట, సామాజిక, అభ్యుదయ ఉద్యమాల్లో ముందడుగు.. ఇలా భిన్న వైరుధ్యాల ఈ జిల్లా.. ఎన్నికల తీర్పులో ప్రతిసారీ ప్రత్యేకతను చాటుకుంటోంది. 2009, 2014 ఎన్నికల్లో అప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. ప్రభుత్వ నాలుగేళ్ల పనితీరుకు పరీక్షగా నిలుస్తోన్న ప్రస్తుత ఎన్నికల్లో ఈ జిల్లా తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో 12 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. జగిత్యాలలో కాంగ్రెస్‌ గెలిచింది. 2009లో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి తెలంగాణలో విఫలమైంది. ఇక్కడ మాత్రం పదిచోట్ల గెలిచింది. ఇప్పుడు వస్తున్న ‘కూటమి’పై ఓటరెలా స్పందిస్తాడనేది కీలకం కానుంది. నియోజకవర్గాల వారీగా ‘సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌’ ఇదీ..

కోరుట్ల: ఎవరెట్లా..?
కోరుట్లలో గత ఎన్నికల నాటి ప్రత్యర్థులే మళ్లీ తలపడుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రా వు (టీఆర్‌ఎస్‌), జువ్వాడి నర్సింగరావు (కాంగ్రెస్‌) మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ ఉంది. విద్యాసాగర్‌రావు నాలు గోసారి టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో దిగారు. గత ఎన్నికల్లో కాం గ్రెస్‌ అభ్యర్థిత్వం దక్కక.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి రెండో స్థానంలో నిలిచిన నర్సింగరావు ఈసారి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. 2009 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విద్యాసాగర్‌రావుపై కొంత సహజ వ్యతిరేకత ఉంది. కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలు ఉన్న ఈ సెగ్మెంట్‌లో పట్టణ ఓటర్ల సంఖ్య ఎక్కువ. కోరుట్లలో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయకపోవడం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మల్లాపూర్‌ చక్కర కర్మాగారంపై ముందడుగు లేకపోవడంపై అసంతృప్తి ఉంది. రెండో పంట నీటిని ఎన్నికల కారణంగా ఇతర ప్రాంతాలకు తరలించారని ఇక్కడి రైతులు అభిప్రాయపడుతున్నారు. 
- విద్యాసాగర్‌రావు అందుబాటులో ఉంటారని పేరు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆయన భరోసాతో ఉన్నారు. ప్రచారంలో ముందున్నారు.
- కాంగ్రెస్‌ అభ్యర్థిని ఆలస్యంగా ఖరారు చేయడంతో పూర్తిస్థాయిలో ప్రచారం మొదలుకాలేదు.

జగిత్యాల.. ఎలాగైనా గెలవాల!
టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ గెలుపు కోసం పోటాపోటీ వ్యూ హాలు పన్నుతున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తాటి జీవన్‌రెడ్డి లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ కీలక నేత కల్వకుంట్ల కవిత ఇక్కడ అంతా తానై వ్యవహరిస్తున్నారు. టి.జీవన్‌రెడ్డి (కాంగ్రెస్‌), ఎ.సంజయ్‌కుమార్‌ (టీఆర్‌ఎస్‌) వరుసగా రెండోసారి పోటీ పడుతున్నారు. జగిత్యాల నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ.. పొత్తులో భాగంగా జీవన్‌రెడ్డి గెలుపునకు పూర్తిస్థాయిలో పని చేస్తున్నారు. వీరిద్దరు కలయిక టీఆర్‌ఎస్‌కు సవాలుగా మారింది. కవిత మూడేళ్లుగా ఇక్కడ టీఆర్‌ఎస్‌ గెలుపునకుప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచే ప్రధాన సామాజిక వర్గం ఓటర్లు ఆ పార్టీ అభ్యర్థి వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. వీరితో జీవన్‌రెడ్డికి ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయి. 
వైద్యుడైన సంజయ్‌కుమార్‌ (టీఆర్‌ఎస్‌)ప్రజల కోసం, పార్టీ కోసం సమయం కేటాయిస్తారనే అభిప్రాయం ఉంది. అయితే, పార్టీలోని ఇతర నేతలు, శ్రేణులతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పేరు. 
జీవన్‌రెడ్డి లక్ష్యంగానే టీఆర్‌ఎస్‌ అధిష్టానం అమలు చేస్తున్న ఎన్నికల వ్యూహం.. సాధారణ ఓటర్లలో జీవన్‌రెడ్డిపై సానుభూతికి కారణమవుతోంది. 

ధర్మపురి (ఎస్సీ): పాతకాపుల బరి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి బరిలో ఉన్న కొప్పుల ఈశ్వర్‌ (టీఆర్‌ఎస్‌), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ (కాంగ్రెస్‌).. పాత ప్రత్యర్థులే. ఈశ్వర్‌ 2004 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. నాలుగేళ్లు అధికారంలో ఉండీ ఆశించిన అభివృద్ధి చేయలేదని ఓటర్లలో అసంతృప్తి ఉంది. రూ.100 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పినా ఆచరణలో జరగలేదనే అభిప్రాయం ఉంది. డిగ్రీ కాలేజీ, బస్సు డిపో నిర్మాణ హామీలూ నెరవేరలేదు. ప్రత్యర్థులు పాతవారే కావడంతో అసాధారణ మార్పులు జరిగితే తప్ప ఫలితం సైతం అదేరకంగా ఉంటుంది. 
విస్తృతమైన ప్రజాసంబంధాలు ఈశ్వర్‌కు కలిసొచ్చే అంశం. 
నాలుగేళ్లగా కాంగ్రెస్‌ సంస్థాగతంగా బలహీనమైంది. 

వేములవాడ: ఎవరికి అండ
పవిత్ర శైవ క్షేత్రం వేములవాడలో నాలుగోసారీ పాత ప్రత్యర్థులే పోటీ పడుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు (టీఆర్‌ఎస్‌), ఆది శ్రీనివాస్‌ (కాంగ్రెస్‌) మధ్యే ప్రధాన పోటీ.. బీజేపీ అభ్యర్థి ప్రతాప రామకృష్ణకు వచ్చే ఓట్లు ఫలితాలపై ప్రభావం చూపనున్నా యి. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి పనులపై రమేశ్‌బాబు ప్రచారం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు లేకుండా పనిచేశామని చెబుతున్నారు. ప్రత్యర్థి పాత వ్యక్తి కావడం రమేశ్‌కు అనుకూలాంశంగా కనిపిస్తోంది. రమేశ్‌ గెలిచినా అందుబాటులో ఉండరనే శ్రీనివాస్‌ ప్రచారాన్ని ఓటర్లు గత ఎన్నికల్లో పట్టించుకోలేదు. రమేశ్‌బాబు పౌరసత్వంపై ఆది శ్రీనివాస్‌ న్యాయపోరాటం కొనసాగుతోంది. వీరిద్దరు 2009 నుంచీ ఇక్కడ పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో శ్రీనివాస్‌ బీజేపీ తరపున పోటీ చేశారు. ఈసారి కాంగ్రెస్‌ టికెట్‌పై బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశించి భంగపడిన కీలక నేత ఏనుగు మనోహర్‌రెడ్డి తన వర్గంతో టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌కు అదనపు బలం చేకూరినట్టయ్యింది. ఆది శ్రీనివాస్‌ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్‌ ఆలస్యంగా ఖరారు చేయడంతో ప్రచార వ్యూహం ఆలస్యమైంది. నాలుగోసారి పోటీ చేస్తుండడంలో ఓటర్లలో ఉండే సానుభూతి కలిసి వస్తుందని ఆది శ్రీనివాస్‌ భావిస్తున్నారు.
నియోజకవర్గ కేంద్రం వేములవాడలో వ్యాపార వర్గం మొగ్గు ఎటుంటే వారిదే విజయం..

అంచనాకందని మంథని 
గత ఎన్నికల ప్రత్యర్థులే మళ్లీ తలపడుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ (టీఆర్‌ఎస్‌), మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (కాంగ్రెస్‌) మధ్య హోరాహోరీ నడుస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న ప్రాంతం కావడంతో ఆ పార్టీకి ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. సామూహిక వివాహాలు, సేవా కార్యక్రమాలు, నిత్యం ప్రజలకు సన్నిహితంగా ఉండడం మధుకు కలిసొచ్చే అంశం. మారుమూల అటవీ గ్రామాలకు రవాణా సౌకర్యాల కల్పనతో కూడా ఆయన కొంత అభిమానాన్ని సంపాదించారు. గత ఎన్నికల తర్వాత శ్రీధర్‌బాబు అందుబాటులో లేరనే అసంతృప్తి కాంగ్రెస్‌ శ్రేణులలో ఉంది. దీంతో మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌పై ఈ ప్రభావం పడుతోంది.  ఆ పార్టీ ఆలస్యంగా ప్రచార వ్యూహం మొదలుపెట్టింది. టీఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కాంగ్రెస్‌ పూర్తి స్థాయి ప్రచారం మొదలుపెడితే ఓటర్ల మొగ్గు స్పష్టంగా కనిపించే పరిస్థితి ఉంది.
ఇప్పటికైతే ప్రచారంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మధు ముందున్నారు.
మంత్రిగా తాను చేసిన అభివృద్ధి, టీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధిని పోల్చుతూ శ్రీధర్‌బాబు ప్రచారం సాగిస్తున్నారు.

సిరిసిల్ల.. మెజారిటీపైనే దృష్టి
టీఆర్‌ఎస్‌ ముఖ్యనేత, మంత్రి కె.తారకరామారావు నాలుగోసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న కేటీఆర్‌తో మాజీ ప్రత్యర్థి కె.కె.మహేందర్‌రెడ్డి (కాంగ్రెస్‌) పోటీ పడుతున్నారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి కేటీఆర్‌కు ఎన్నికల్లో అనుకూలంగా కానుంది. సాగునీటి వనరుల అభివృద్ధి, గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన, చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలతో కేటీఆర్‌కు ఆదరణ పెరిగింది. చేనేతల  సంక్షేమ కోసం చేపట్టిన పథకాలతో ఎక్కువ సంఖ్యలో ఉండే ఈ వర్గీయులలో కేటీఆర్‌పై సానుకూలత ఉంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ప్రత్యర్థి పార్టీల ముఖ్యనేతలు, శ్రేణులు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. కేటీఆర్‌తోనే సిరిసిల్లకు గుర్తింపు వచ్చిందనే అభిప్రాయం ఉంది. అత్యధిక పోలింగ్‌ నమోదయ్యేలా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రత్యేక ప్రచార ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి.
కేటీఆర్‌ గెలుపు విషయంలో సందేహాలు లేకపోవడంతో గతంలో కంటే భారీ మెజారిటీ పెంపు లక్ష్యంగా ఇక్కడి టీఆర్‌ఎస్‌ ప్రచారం సాగుతోంది.

హుస్నాబాద్‌:సందడి లేదు..
కరువు ప్రాంతమైన హుస్నాబాద్‌ స్థానాన్ని సర్దుబాటులో ప్రజాకూటమి సీపీఐకి కేటాయించిం ది. తాజా మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌కుమార్‌ (టీఆర్‌ఎస్‌), చాడా వెంకట్‌రెడ్డి (సీపీఐ), చాడ శ్రీనివాస్‌రెడ్డి (బీజేపీ) పోటీ పడుతున్నారు. తాగునీటి సరఫరా, జిల్లాలు, మండలాల పునర్విభజనపై గ్రామాల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి బరిలో లేకపోవడంతో టీఆర్‌ఎస్‌కు నష్టం జరిగే పరిస్థితి కనిపించట్లేదు. ఏడాదిన్నర క్రితం ఇక్కడ నిర్వహించిన బహిరంగసభలో ఏఐసీసీ ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్‌ సమక్షంలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిని కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించారు. అనంతరం ప్రవీణ్‌రెడ్డి 136 గ్రామాల్లో ప్రచారం చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉండడంతో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని అనుకున్న ఆ పార్టీ శ్రేణులు.. ఇప్పుడు కూటమి పేరుతో సర్దుబాటు నిర్ణయంతో ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ఇక్కడ ఎన్నికల సందడి కనిపించడం లేదు. ఇది టీఆర్‌ఎస్‌కు ఊరట కలిగించే పరిణామం.

హుజూరా‘బాద్‌షా’ ఎవరో!
టీఆర్‌ఎస్‌ కీలక నేత, మంత్రి ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌లో నాలుగోసారి పోటీ చేస్తున్నారు. ఆయనతో పాడి కౌశిక్‌రెడ్డి (కాంగ్రెస్‌) పోటీ పడుతున్నారు. మంత్రిగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువ మందితో వ్యక్తిగత పరిచయాలు ఈటల రాజేందర్‌కు అనుకూలాంశాలు. నీటి వనరుల అభివృద్ధి, ఖరీఫ్‌ పంటకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అనుకూలతను పెంచుతోంది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీకి గట్టి పట్టున్న హుజూరాబాద్‌లో ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. రాజేందర్‌ కీలకమంత్రిగా ఉన్నా.. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలను అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు. 
అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడంతో ఎన్నికల వ్యూహంలో కాంగ్రెస్‌ కొంత వెనుకబడింది.

పెద్దపల్లి: పార్టీల్లో లొల్లి
తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), చింతకుంట విజయరమణరావు (కాంగ్రెస్‌) నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన విజయరమణరావు ఈసారి కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగారు. నాలుగేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని మనోహర్‌రెడ్డి ధీమా. నాలుగేళ్లలో చెప్పుకోదగిన స్థాయిలో ఏమీ జరగలేదని, ఇదే తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్‌ అభ్యర్థి భావన.. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి గ్రామపంచాయతీ మాదిరిగానే ఉందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని విమర్శిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా.. ప్రజలతో వ్యవహరించే వ్యక్తిగత శైలి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఇబ్బందిగా మారనుందనే అభిప్రాయం ఉంది. గ్రామస్థాయిలోని నేతలు గుర్తింపు సమస్యతో పూర్తిస్థాయిలో పని చేయడంలేదు. మొత్తంగా అభ్యర్థి పరంగా కాంగ్రెస్, పార్టీ పరంగా టీఆర్‌ఎస్‌ ఇక్కడ ముందంజలో ఉన్నాయి.
ప్రధాన సామాజికవర్గం ఓట్లపై టీఆర్‌ఎస్‌ ధీమా ∙వ్యక్తిగత సంబంధాలు విజయరమణరావు బలం.

కరీంనగర్‌: మూడు ముక్కలాట
కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌ (టీఆర్‌ఎస్‌), పొన్నం ప్రభాకర్‌ (కాంగ్రెస్‌), బండి సంజయ్‌కుమార్‌ (బీజేపీ) మధ్య ప్రధాన పోటీ ఉంది. కరీంనగర్‌లో ఎవరూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలవరనే సంప్రదాయాన్ని బద్ధలుకొడుతూ గంగుల కమలాకర్‌ ఇక్కడ వరుసగా రెండుసార్లు గెలుపొందారు. కరీంనగర్‌ నగరంలోనే అధిక ఓట్లు ఉన్నాయి. కరీంనగర్‌ గ్రామీణ ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ ద్వితీయశ్రేణి నేతలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. అభివృద్ధి పనులలో అవినీతి జరిగిందనే నినాదంతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఈయన ఇప్పుడు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభా కర్‌ 2009లో కరీంనగర్‌ ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. గంగుల కమలాకర్, పొన్నం ప్రభాకర్‌ వ్యక్తిగతంగా సన్నిహితులు. గత రెండు ఎన్నికల్లోనూ ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా పోటీచేస్తూ పరస్పరం సహకరించుకున్నారనే ప్రచారం ఉంది. గతంలోని సాన్నిహిత్యం ఇప్పుడు ఎవరో ఒకరికి ఇబ్బందికరంగా మారే పరిస్థితి.. కరీంనగర్‌ అసెంబ్లీ స్థానంపై మొదటి నుంచి వెలమ వర్గం ప్రభావం ఎక్కువ. ఆ వర్గం అభ్యర్థి లేకుండా ఎన్నికలు జరుగుతుండడం ఇదే మొదటిసారి. ఈ వర్గం ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంది.
కమలాకర్‌కు గత ఎన్నికల్లో త్రిముఖ పోటీ కలిసొచ్చింది. ఇప్పుడూ అదే పరిస్థితి కనిపిస్తోంది.
తెలంగాణ కోసం లోక్‌సభలో తాను నాడు చేసిన పోరాటం, బీసీ నినాదం కలిసి వస్తుందని కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ భావిస్తున్నారు.

మానకొండూరు (ఎస్సీ): గెలుపు తకరారు
గత రెండు ఎన్నికల్లో ఓటర్లు ఒకసారి కాంగ్రెస్‌ను, మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. ఈసారీ ఆ సెంటిమెంట్‌ కొనసాగుతుందా అనేది ఆసక్తికరం. తాజా మాజీ ఎమ్మెల్యే ఏర్పుల బాలకిషన్‌ (టీఆర్‌ఎస్‌), మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ (కాంగ్రెస్‌) మధ్య ప్రధాన పోటీ ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బాలకిషన్‌ ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్‌ అభ్యర్థి మోహన్‌ ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి పోటీచేసిన కవ్వం పల్లి సత్యనారాయణ.. ఇప్పుడు మోహన్‌ గెలుపునకు పనిచేస్తున్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండరనేది టీఆర్‌ఎస్‌కు ప్రతికూలం
2009 నుంచి 2014 వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి పరిస్థితిని, గత నాలుగేళ్లను పోల్చి చూసుకోవాలని మోహన్‌ అంటున్నారు.

రామగుండం: ‘కార్మిక’ గండం
కార్మిక క్షేత్రం రామగుండంలో ఎన్నికలు రసవత్తరంగా ఉన్నాయి. 2009 నుంచి ఇక్కడ ఒకేరకంగా ఎన్నికలు జరుగుతున్నాయి. సోమారపు సత్యనారాయణ (టీఆర్‌ఎస్‌), కోరుకంటి చందర్‌ (ఏఐఎఫ్‌ బీ), మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ (కాంగ్రెస్‌), బల్మూరి వనిత(బీజేపీ) పోటీ పడుతున్నారు. 2009లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసిన కోరుకంటి చందర్‌.. 2014లో, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ రెబెల్‌గా ఏఐఎఫ్‌బీ నుంచి బరిలో ఉన్నారు. గత ఎన్నికల తరహాలోనే సోమారపు –కోరుకంటి మధ్య ప్రధాన పోటీ ఉంది. సత్యనారాయణ వైఖరితో సొంత పార్టీ నేతలు చందర్‌కు మద్దతు తెలుపుతున్నారు. రామగుండం ఎన్నికలపై సింగరేణి కార్మికుల ప్రభావం ఎక్కువ. రాష్ట్ర స్థాయి టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు వచ్చినప్పుడు మినహాయిస్తే కార్మిక సంఘాల నేతలు సత్యనారాయణ కోసం ప్రచారం చేయడంలేదు. వారసత్వ నియామకాల విషయంలో నిబంధనలు పెట్టడంపై అసంతృప్తి ఉంది. కార్మికుల నివాసాలకు ఏసీ, ఇతర సౌకర్యాల కల్పన వంటి హామీలు ఆచరణలోకి రాలేదని అసంతృప్తి నెలకొంది.
సత్యనారాయణపై సహజ వ్యతిరేకత ∙రెండుసార్లు ఓటమితో చందర్‌పై సానుభూతి..

చొప్పదండి (ఎస్సీ): పోటీ దండి
మిశ్రమ ప్రాంతాలతో కూడిన చొప్పదండిలో సుంకె రవిశంకర్‌ (టీఆర్‌ఎస్‌), మేడిపల్లి సత్యం (కాంగ్రెస్‌), బొడిగె శోభ (బీజేపీ) పోటీపడుతున్నారు. రవిశంకర్‌ ఒక్కరే నియోజకవర్గానికి చెందిన వారు. టీఆర్‌ఎస్‌ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడైన ఆయన కేసీఆర్‌ ప్రభుత్వ పథకాలతోనే ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన మేడిపల్లి సత్యంకు గ్రామగ్రామాన వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ పాలనలో చొప్పదండి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే ప్రచారంతో ఆయన ముందుకు సాగుతున్నారు. టీఆర్‌ఎస్‌ ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు టిక్కెట్‌ నిరాకరించింది. దీంతో ఆమె బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో నిలిచారు. శోభకు వచ్చే ఓట్ల సంఖ్య పెరిగే కొద్ది టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఇబ్బందికరమే..
బొడిగె శోభ ఈ నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలను శాసించే పరిస్థితిలో ఉన్నారని చెప్పవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement