
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లాంటి అవగాహన రహిత నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఇంతటి నిరుద్యోగ సమస్య ఎప్పుడూ లేదని, వేలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, లక్షల కోట్ల రూపాయల సంపద నష్టపోయామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక తిరోగమన విధానాలకు నిరసనగా ఏఐసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 30న ఢిల్లీలోని రాం లీలా మైదానంలో నిర్వ హించనున్న ‘భారత్ బచావో ర్యాలీ’కి రాష్ట్రం నుంచి పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరుకావాలన్నారు. కార్యక్రమ బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సి.జె.శ్రీనివాస్‌లకు అప్పగిస్తున్నట్టు తెలిపారు.