టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పరిపాలన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందా? లేక టీఆర్‌ఎస్ పార్టీనా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు జరిగినా.. ప్రభుత్వ పరంగా జరగాల్సిన వ్యహారాలన్నీ ప్రభుత్వ నియంత్రణలో జరగాలని.. కానీ పార్టీ నిర్వహించకూడదని భట్టి పేర్కొన్నారు.
గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన పంచాయతీలను ప్రోటోకాల్ పాటించకుండా టీఆర్ఎస్ నాయకులు ప్రాంభించారని భట్టి అన్నారు. తన నియోజకవర్గంలోని కొత్త పంచాయతీ భవనాన్ని రాష్ట్రవిత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ ప్రారంభించడమెంటని ప్రశ్నించారు. స్థానిక నాయకులు, అధికారులు లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారికంగా, ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన కార్యక్రమం ఇలా ప్రోటోకాల్ లేని వ్యక్తులు నిర్వహించడాన్ని విమర్శించారు.
ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎంపీడీవోని బదిలీ చేయడం దుర్మార్గ చర్యగా భట్టి పేర్కొన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ నిరంకుశ పాలన ఇలాగే సాగితే.. జిల్లాల్లో కలెక్టర్ల స్థానాల్లో టీఆర్ఎస్ అధ్యక్షులే పాలన చేసే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment