
కర్రలతో దాడి చేస్తూ.. తంతూ రోడ్డుపై పరుగెత్తించారు..
కోల్‌కతా: ఓ మహిళా బీజేపీ నేత పట్ల తృణమూల్ కాంగ్రెస్ నేతలు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. కనీసం మహిళా అనే గౌరవం లేకుండా రెండు సార్లు దాడి చేశారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఒక ఘటన పోలీసుల సమక్షంలోనే జరగగా.. మరో ఘటన మీడియా సాక్షిగా చోటుచేసుకుంది. అయినా నిందితులపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాకపోడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. గత బుధవారం(సెప్టెంబర్ 26)న బీజేపీ రాష్ట్ర బంద్ నేపథ్యంలో దిసర్కార్ అనే మహిళా నేత తమ కార్యకర్తలతో కోల్‌కతాకు 40 కిలోమీటర్లో దూరంలో ఉన్న బారసత్‌లో రైల్‌రోకో నిర్వహించే ప్రయత్నం చేశారు. దీనిని అడ్డుకునేందుకు వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ నేత, ఆ పంచాయతీ ఛీఫ్ అర్షదుజ్జమాన్ సదరు మహిళపై దాడి చేశాడు. కర్రలతో ఆమెను కొడుతూ ఒక తన్ను తన్ని పరుగెత్తించాడు. ఈ ఘటననంతా ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఇక ఈ దాడి గురించి ఆమెను ఓ మీడియా రిపోర్టర్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా.. మరోసారి ఆమెపై మీడియా సాక్షిగానే దాడి చేశారు. అర్షదుజ్జమాన్ సహాయకుడు కుతుబుద్దిన్ ఆమెను తంతూ.. కాళ్లు చేతులు కట్టేసి రోడ్డుపై విసిరేసాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఆ పార్టీ స్పందించలేదు.