
సాక్షి, విజయవాడ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ పర్యటన నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై టీఆర్‌ఎస్ అధినేత అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు హల్‌చల్ చేస్తున్నారు. గురువారం విజయవాడ దుర్గమ్మకు మొక్కలు సమర్పించుకునేందుకు కేసీఆర్ కుటుంబసమేతంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ శ్రేణులులు ‘జై కేసీఆర్.. జై జై కేసీఆర్..’ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమాన నేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై అభిమానం చాటుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌కు స్వాగతం చెబుతూ నగరంలో కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతల బ్యానర్లు, పార్టీ ఫ్లెక్సీలు దర్శనమివ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. మరోవైపు కేసీఆర్ రాక సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పడితే కానుకలు సమర్పించుకుంటానని గతంలో మొక్కుకున్న కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడ్డాక రెండోసారి విజయవాడలో పర్యటిస్తున్నారు.
కేసీఆర్‌కు ఘనస్వాగతం
కాగా, గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇంచార్జ్ కలెక్టర్ విజయ కృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, తెలంగాణ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుంచి ప్రత్యేక కాన్వాయ్ వాహనాల్లో కేసీఆర్ కుటుంబం దుర్గగుడికి వెళ్లి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment