కంబాలపల్లిలో రాళ్ల వర్షాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ(ఫైల్), గాయపడిన మహిళ
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : బాంబుల మోతతో కృష్ణపట్టె ఒక్కసారిగా దద్దరిల్లింది. ఆదివారం అర్ధరాత్రి తిరుమలగిరి మండలం నాయకునితండాలో రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని తలపించే విధంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు బాంబులు(చేపల వేటకు ఉపయోగించేవి), బీరు సీసాలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో సుమారు 40 ఇళ్లు ధ్వంసం కాగా కూలర్లు, టీవీలు, మంచాలు, వాహనాలు తదితర సామగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు.
ఆధిపత్య పోరుకోసం
తండాలో తామంటే తామే పై చేయి సాధించాలనే భావనతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు కొంతకాలంగా పోటీపడుతున్నారు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఓట్లు రావడంతో పాటు గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందాడు. ఈనెల 13వ తేదీన శనివారం సఫావత్ తండాలో ఓ శుభకార్యానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మేరావత్ భిక్షాలు, టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మేరావత్ స్వామి వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన భిక్షాలు, టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన స్వామితో మీకు ఇంత సహాయం చేసినా రాజకీయంగా మాకు ఎందుకు సపోర్టు చేయడం లేదు అని స్వామిని భిక్షాలు నిలదీశారు.
దీంతో తండాకు చేరుకున్న స్వామి తన కుమారుడు మేరావత్ దస్రూకు ఆదివారం రాత్రి చెప్పడంతో తన తండ్రిని తిడతావా అని భిక్షాలును దస్రూ నిలదీయడంతో ఘర్షణ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఒకరిపై ఒకరు రాళ్లు, బీరు సీసాలు వేసుకుంటూ దాడికి పాల్పడడంతో ఇళ్లలోని సామగ్రి కూలర్లు, టీవీలు, మంచాలు, వాహనాలు, సుమారు 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. గ్రామంలో భయాందోళన సృష్టించేం దుకు బాంబులు (చేపల వేటకు ఉపయోగించేవి) రువ్వుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దస్లీ, మేరావత్ సోమ్లాకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు తండాకు చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కుర్మయ్య తెలిపారు.
కృష్ణపట్టెలో బాంబుల సంస్కృతి
కృష్ణా పరీవాహక గ్రామాలు కావడం, అటవీ ప్రాంతానికి సమీపాన ఉండడంతో ఈ ప్రాంత ప్రజలు ప్రధానంగా చేపల వేట కోసం తమ పొలాల్లోని అడవి పందుల బారి నుంచి కాపాడుకోవడానికి బాంబులను ఉపయోగిస్తారు. వీటిని సమీపంలో ఉన్న ఆంధ్ర పరిసర ప్రాంతాల నుంచి బాంబుల ముడిసరుకులను తీసుకువచ్చి నిల్వచేస్తారు. అయితే గ్రామాల్లో పార్టీల మధ్య, గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగే క్రమంలో అందుబాటులో ఉన్న బాంబులను ఒకరిపై ఒకరు విసురుకొని భయభ్రాంతులకు గురిచేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడుతుంటారు.
తండాలో పోలీసుల పహారా
తండాలో చోటుచేసుకున్న ఘర్షణలతో చుట్టుపక్కల తండాల ప్రజలు, గ్రామస్తులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. తండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నాగార్జునసాగర్ సీఐ వేణుగోపాల్, హాలియా సీఐ ధనుంజయ్‌గౌల ఆధ్వర్యంలో భారీగా పోలీసు పహారా నిర్వహించారు. తిరుమలగిరి, నిడ్మనూరు, హాలియా ఎస్‌ఐలు కుర్మయ్య, యాదయ్య, వీరరాఘవులు, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.
కృష్ణపట్టెలో ఫ్యాక్షన్...యాక్షన్
చందంపేట(దేవరకొండ) : జిల్లాలో నాటు బాంబుదాడుల సంస్కృతి ఎప్పటినుంచో ఉంది. కొన్ని సంవత్సరాలుగా దాడుల సంస్కృతి తగ్గుముఖం పట్టినా అప్పుడప్పుడూ జిల్లా సరిహద్దు గ్రామాల్లో జరిగిన ఘర్షణల్లో వీటిని వాడుతున్నారు. తాజాగా తిరుమలగిరి మండలం నాయకునితండాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య బాంబులదాడి జరగడంతో మరోసారి కంబాలపల్లి బాంబుల దాడులు గుర్తుకొచ్చాయి. ఒకప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న కంబాలపల్లి గ్రామంలో మాజీఎంపీపీ ముత్యాల సర్వయ్యకు నక్సలైట్ల చేతిలో హతమైన మేకల మల్లయ్యకు ఆధిపత్య పోరు ఉండేది. అప్పుడు టీడీపీ–కాంగ్రెస్‌ల మధ్య ఉన్న పోరు కాస్త ఇప్పుడు తెలంగాణ పార్టీలో ఉన్న ఇద్దరి మధ్య సాగుతోంది.
అప్పట్లో మేకల మల్లయ్య, సర్వయ్యల మధ్య ఎన్నోసార్లు బాంబు, రాళ్లదాడులు జరిగాయి. ఇప్పుడు తెలంగాణ పార్టీలోనే ఉన్న ఇద్దరి మధ్య గత ఏడాది ఫిబ్రవరిలో ఇరువర్గాలు రాళ్లదాడులు చేసుకున్నారు. మేకల మల్లయ్య హత్యకు గురైన అనంతరం ఆ గ్రామంలో జెడ్పీటీసీగా ఉన్న కిషన్‌రెడ్డి, సర్వయ్యల మధ్య కొంత కాలం ఆధిపత్య పోరు నడిచి పరసర్పర దాడులకు దారితీసింది.
వారి మధ్య నాటుబాంబుల దాడి జరిగి ఆ గ్రామం సంచనాలకు కేంద్రబిందువైంది. అయితే కిషన్‌రెడ్డి గ్రామాన్ని విడిచి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండడంతో ఆ వర్గాల మధ్య గొడవలు సద్దుమణిగాయి. అనంతరం సర్వయ్య వర్గంలోనే ఉండి సర్పంచ్‌గా గెలుపొందిన సర్వయ్యకు గోవిందుకు మధ్య విబేధాలు మొదలయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీపీ రేసులో ఉండి దాదాపు ఎంపీపీ అవుతాడనుకున్న ముత్యాల సర్వయ్య అనుహ్యంగా ఓటమి పాలవ్వడంతో అదే సమయంలో గోవిందుభార్య ఎంపీటీసీగా గెలుపొం దడంతో సర్వయ్యకు దక్కాల్సిన ఆపదవి కాస్త గోవిందు భార్యకు దక్కింది. అప్పటి నుంచి ఈ గొడవలు మరింత తార స్థాయికి చేరాయి. ఎక్కడ బాంబులు పేలినా కంబాలపల్లి గ్రామం ఒక్కసారిగా ఉలికి పడుతుంటుంది.
ఆడమనిషని కూడా చూడలే..
ఆడమనిషి అని కూడా చూడకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది వచ్చి మా ఇంటిపై బాంబులతో దాడి చేసి నన్ను చితకబాదారు. ఇంటిపై దాడి చేయడంతో ఇంట్లో సామాను మొత్తం పాడైపోయింది.
బాణావత్ దర్సి
పార్టీ మారామనే..
మేము ఇటీవలే టీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారమనే కక్షతోనే మా ఇంటిపై టీఆర్‌ఎస్ నాయకులు దాడి చేశారు. ఓట్లు మాత్రమే వేశాము కాని అసలు పార్టీలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. కక్షపూరితంగా మా ఇంటిపై రాళ్లు, బాంబులు, బీరు సీసాలతో దాడి చేశారు. – మేరావత్ నేజా
కళ్లల్లో కారంచల్లి కొట్టారు
మేం టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్నామని, గతంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటేశామని కక్ష కట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్లు నాపై దాడి చేశారు. ఆడవాళ్లు, మగవాళ్లు కలిసి కళ్లల్లో కారం చల్లి నన్ను కొట్టారు. ఆడమనిషి అని కూడా చూడకుండా ఎక్కడపడితే అక్కడ కాళ్లతో తన్నారు. – మేరావత్ బుజ్జి
Comments
Please login to add a commentAdd a comment