
బుధవారం కేటీఆర్‌ను కలసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభలో టీఆర్‌ఎస్ బలం 100కు చేరింది. టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి బుధవారం చేసిన ప్రకటనతో అధికార పార్టీ అసెంబ్లీలో సెంచరీ పూర్తిచేసినట్లయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున గెలిచిన 88 మంది, ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక టీడీపీ, తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకుంటే గులాబీ పార్టీ బలం వందకు చేరింది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బుధవారం హైదరాబాద్‌లో కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్ష కలిశారు. అనంతరం కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పక్షాన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ హర్ష లేఖ విడుదల చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అందులో తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయ డంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తున్నారని, పాలమూరు పచ్చగా మారుతోందని, వలసెళ్లిన వారు తిరిగి వస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తన నియోజకవర్గ సమ స్యలను సీఎం దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. శ్రీశైలం ముంపు బాధితులకు ఉద్యోగావకాశాలు, సోమశిల–సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం, పాలమూరు–రంగారెడ్డి ముంపు బాధితులకు పరిహారం లాంటి విషయాలపై స్పష్టమైన హామీ ఇచ్చారని, కేసీఆర్‌పై ఉన్న విశ్వాసంతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆ లేఖలో వెల్లడించారు.
గెలుపు బాధ్యతలు అప్పగింత
మహబూబాబాద్ (మానుకోట) లోక్‌సభ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ బుధవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిని చర్చించారు. ఎమ్మెల్యేలతోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇల్లందు, పినపాక మాజీ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కూడా పాల్గొన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా కేసీఆర్ ఎవరిని నియమించినా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు చెప్పారు. ఈ పార్లమెంటు స్థానం ఎన్నికల ఇన్‌చార్జీగా సత్యవతి రాథోడ్‌ను సీఎం ప్రకటించారు.
వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల్లో పార్టీ నాయకులను సమన్వయం చేసి, ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించే బాధ్యతలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అప్పగించారు. ఈ సమావేశంలో పోడు వ్యవసాయం చేసుకునే రైతులను అధికారులు వేధిస్తున్న విషయాన్ని కూడా నాయకులు సీఎం దృష్టికి తెచ్చారు. అర్హులైన రైతులకు నష్టం కలగని విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మహబూబ్ నగర్, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల్లో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా, గెలిపించుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సీఎంతో చెప్పారు.
‘హోళీ’కే జాబితా
టీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను గురువారం వెల్లడించనున్నారు. మంగళవారం జరిగిన నిజామాబాద్ సభలో కేసీఆర్ ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశారు. ఇప్పటికే పార్టీ తరఫున అభ్యర్థులుగా నిర్ణయించిన వారికి అనధికారిక సమాచారమిచ్చారు. నామినేషన్లు దాఖలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మల్కాజ్‌గిరి సీటును పార్టీకి చాలాకాలంగా దగ్గరగా ఉంటున్న కె.నవీన్‌రావుకు దాదాపు ఖరారు చేసింది. అయితే, ఇతర పార్టీల వ్యూహం, మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ విషయంలో మంత్రి శ్రీనివాసయాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ పేరు కూడా దాదాపు ఖరారయింది. సామాజిక సమీకరణల నేపథ్యంలో దండె విఠల్, బొంతు శ్రీదేవి యాదవ్‌ల పేర్లు కూడా చివరి నిమిషం వరకు పరిశీలనలో ఉన్నాయి. పెద్దపల్లికి ప్రభుత్వ సలహాదారు జి.వివేకానందను ఖరారుచేసే అవకాశముంది. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మరో ఇద్దరి పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. నల్లగొండ సీటును ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఇచ్చే విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో.. వ్యతిరేకత ఉండకుండా కొత్త అభ్యర్థి అయితే బాగుంటుందనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తేరా చిన్నపురెడ్డి, వేముగంటి నర్సింహారెడ్డిల పేర్లను పరిశీలిస్తున్నారు. వీటిని మినహాయిస్తే మిగిలిన అన్ని స్థానాల్లో ఏకాభిప్రాయం వచ్చిందని, ఈ మేరకు అభ్యర్థులకు కూడా సమాచారమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment