సికింద్రాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి సాయికిరణ్ ఎన్నికల ప్రచారం బుధవారం మొదలైంది. ప్రచారాన్ని శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. సాయికిరణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.
సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయంతో మంచి ఊపుమీదున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ.. గ్రేటర్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచార హోరును పెంచనుంది. ఈనెల 29న ఎల్‌బీ స్టేడియంలో ‘గులాబీ బాస్’ కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరుసటి రోజు(మార్చి 30) నుంచి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రోడ్‌షో నిర్వహించనున్నారు. మార్చి 31, ఏప్రిల్ 1,7 తేదీల్లోనూ ఆయన ఈ నియోజకవర్గంలోని తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇక సికింద్రాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో ఏప్రిల్ 4,5,6 తేదీల్లో అంబర్‌పేట్, ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇక మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలోని ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మేడ్చల్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 1,2,3,8 తేదీల్లో రోడ్‌షోలతో ప్రచారం హోరెత్తించనున్నారు.
ప్రధానంగా గ్రేటర్ పరిధిలోని ఈ మూడు లోక్‌సభ స్థానాల నుంచి రాజకీయ నేపథ్యం, గెలుపునకు అవకాశంతో పాటు అన్ని విధాలా బలమైన కొత్త ముఖాలనే పార్టీ బరిలోకి దించింది. అయితే, పార్టీకి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, కేడర్ బలంగా ఉన్నప్పటికీ అభ్యర్థులు కొత్తవారు కావడంతో ప్రచార భారాన్ని పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లు భజాన వేసుకున్నారు. మహానగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు గత ఐదేళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలను అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు ఓటర్లకు వివరించనున్నారు. ప్రధానంగా పట్టణ మిషన్ భగీరథ పథకం కింద మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో కృష్ణా, గోదావరి జలాలతో దాహార్తిని సమూలంగా దూరం చేయడంతోపాటు.. ఓఆర్‌ఆర్ లోపలున్న 190 గ్రామాలు, నగరపాలక సంస్థలకు తాగునీరు అందించిన తీరు, నిరుపేదలకు రూ.1కే నల్లా కనెక్షన్ ఏర్పాటు వంటి పథకాలను వివరించనున్నారు. ఇక గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ చిక్కులను నివారించేందుకు చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ పనులు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల పురోగతి, పింఛన్లు తదితర సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఈ అంశాలనే ప్రధాన అస్త్రాలుగా అత్యధిక మెజార్టీ సాధించాలని యోచిస్తున్నారు. అభ్యర్థులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆ దిశగా ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment