సినీ ప్రముఖులతో కలిసి అల్పాహారం చేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
బంజారాహిల్స్: ప్రజాసేవ కోసం వచ్చానని, ఆశీర్వదిస్తే ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసంక్షేమం కోసం పాటుపడతానని సీఎం కేసీఆర్ ఆశయ సాధన కోసం లోక్‌సభలో గళం విప్పుతానని సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ అన్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో గురువారం ఎఫ్‌ఎన్‌సీసీ, ‘మా’, ఫిలింనగర్ సొసైటీ, పలువురు సినీ ప్రముఖులతో ఎన్నికల సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరైన సమావేశంలో సాయికిరణ్ మాట్లాడారు. తనకు ఎంత పెద్ద పదవి వచ్చినా మీ బిడ్డగా మీ మధ్యలోనే ఉంటానని, మీ తమ్ముడిలా ఆదరించాలని, మీ ప్రోత్సాహంతోనే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ ఎల్లవేళలా తనకు అండగా నిలుస్తున్న సినీ ప్రముఖులు, సినీ కార్మికులు, చిత్రపరిశ్రమకు చెందిన సాంకేతిక నిపుణులు ఈ ఎన్నికల్లో తన బిడ్డ సాయికిరణ్ యాదవ్‌ను గెలిపించాలన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ సాయి తన బిడ్డతో సమానమని గెలిపించి తీరుతామని వెల్లడించారు. దర్శకుడు ఎన్. శంకర్, నటి హేమ, ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎల్ నారాయణ, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, దర్శకులు బి.గోపాల్, సాగర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment