న్యూఢిల్లీ: తెలంగాణలో అధికార పార్టీగా ఉంటూనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాటాన్ని సమర్థించిన టీఆర్‌ఎస్.. ఎన్డీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం విషయంలో మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల అంశంపై గడిచిన కొద్ది రోజులుగా పార్లమెంట్‌లో ఆందోళనలు చేస్తోన్న టీఆర్‌ఎస్ ఎంపీలు.. అవిశ్వాస తీర్మానం నోటీసులను స్పీకర్ చదివిన సందర్భాల్లోనూ వెనక్కి తగ్గకపోవడం, దాంతో అవిశ్వాసంపై చర్చ జరగకుండా సభ వాయిదాపడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.
టీఆర్‌ఎస్ వైఖరి ఇదే.. : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయంలో టీఆర్‌ఎస్ తటస్థంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు ఎంపీలు తెలిపారు. రిజర్వేషన్లను రాష్ట్రానికే వదిలిపెట్టాలన్న డిమాండ్‌తో లోక్‌సభలో చేస్తున్న ఆందోళనలు మంగళవారం కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు. సోమవారం కూడా టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో ధర్నా చేశారు. ఆ సందర్భంలో మీడియా అడిగి పలు ప్రశ్నలకు వారు సమాధానాలిచ్చారు.
బీజేపీకి సహకరిస్తున్నారా? : అవిశ్వాస తీర్మానాలు సభ ముందుకు వచ్చేలా మీరు మద్దతుగా నిలబడితే ఈ అంశాలన్నీ చర్చకు వస్తాయి కదా అని ఎంపీ జితేందర్‌రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ‘రెండు వారాలుగా మా డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్నాం. డిమాండ్లను హౌస్‌లో పెట్టి పరిష్కరించుకుంటాం. ఎవ్వరినీ అనుసరించాల్సిన అవసరం మాకు లేదు. సరైన హామీ లభించే వరకు ఆందోళన కొనసాగుతుంది’అని సమాధానమిచ్చారు. టీఆర్‌ఎస్ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయికదాని విలేకరులు ప్రస్తావించగా... ‘వాళ్లకు వాళ్లు ఆరోపణలు చేసుకోవడం కాదు. ఈరోజు వాళ్లకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని మనసొచ్చింది. మా ప్రజల ఆకాంక్షలు, డిమాండ్లు మాకు ముఖ్యం. మా డిమాండ్లపై వాళ్లు వాగ్దానం చేసి మమ్మల్ని కూర్చోబెడితే కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం’అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment