సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రకటలు చేసినా, మంత్రులు కార్మికులకు నచ్చజెప్పినా 300 మంది కూడా ఉద్యోగంలో చేరలేదని వెల్లడించారు. జాయిన్ అయినవాళ్లకు కూడా డ్యూటీలు వేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కార్మికులెవరూ భయపడొద్దు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే గుర్తింపు సంఘం ఆమోదం తీసుకోవాలనే చట్టముంది. చర్చల ప్రక్రియమొదలుపెట్టండని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’అన్నారు.
కేసీఆర్ ఇష్టారాజ్యం కాదు..
ఉద్యోగ సంఘాలను కలిసి రేపో, ఎల్లుండో పెన్ డౌన్ చేయాలని విజ్ఞప్తి చేస్తామని అశ్వత్థామరెడ్డి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా దగ్గరికి ఆర్టీసీ ప్రతినిధులు వెళ్లి సమస్యను వివరించారని తెలిపారు. 33 రోజుల నుంచి సమ్మె కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమస్య పరిష్కరానికి కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ‘కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే నడవదు. కోర్టులు ఉన్నాయి. మేం సెలక్షన్ ప్రక్రియ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్లం’అని చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్మికులు ఉద్యోగాల్లో చేరడం లేదని ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు అందరూ కలిసినా కార్మికులను ఉద్యోగంలో చేర్చలేకపోతున్నారని వెల్లడించారు. ఆర్టీసీ సమ్మె న్యాయబద్ధమైందని రాజిరెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment