
ముంబై: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) చుట్టూ నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరించకుంటే ప్రతిపక్షాలన్నీ ఐక్యమై 2019లో సార్వత్రిక ఎన్నికల్ని బహిష్కరించాలని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే పిలుపునిచ్చారు. పాల్ఘర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో రాత్రికిరాత్రి ఓటింగ్ శాతం పెరిగిపోవడంపై ఎన్నికల సంఘాన్ని కోర్టుకు ఈడుస్తాతామని హెచ్చరించారు.
‘వేడి కారణంగానే ఈవీఎంలు పనిచేయడం లేదని ఎన్నికల కమిషనర్ చెప్పడం హాస్యాస్పదం. దేశంలో వాతావరణ పరిస్థితులపై ఎన్నికల కమిషనర్‌కు కనీస అవగాహన ఉందా? ఆ లెక్కన ఐపీఎల్ తరహాలో 2019 ఎన్నికల్ని రాత్రిపూట నిర్వహిస్తారా?’ అని ప్రశ్నించారు. ‘పాల్ఘర్‌లోని 8 లక్షల మంది ఓటర్లలో ఆరు లక్షలమంది బీజేపీని తిరస్కరించారు. 2014 ఎన్నికల్లో పాల్ఘర్‌లో లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ ఈసారి కేవలం కొన్నివేల ఓట్లతో గట్టెక్కడమే ఇందుకు నిదర్శనం’ అని అన్నారు.