సాక్షి, ముంబై: రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరొందిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కోసం రాజకీయ పార్టీలు క్యూ కడుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంలో తెరవెనుక ఆయన కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అలాగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ-జేడీయూ మహాకూటమి గెలపు వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన సలహాదారుడిగా పనిచేశారు. దీంతో దేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఆయనను తమ పార్టీకి వ్యూహకర్తగా ఉండాలంటూ స్వాగతిస్తున్నాయి.
బెంగాల్‌లో మమత బెనర్జీతో ఇప్పటికే ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే ఇవన్నీ వారంతా వారి పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రశాంత్ కోరుతున్నారు. కానీ అందుకు భిన్నంగా శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే మాత్రం ప్రశాంత్ కిషోర్ వద్ద ఓ కీలక ప్రతిపాదన ఉంచారని తెలుస్తోంది. త్వరలో మహారాష్ట్రలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందేకు కృషి చేస్తూనే.. తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను సమర్ధవంతమైన రాజకీయనేతగా తయారుచేయాలని ఆయన వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది.
ప్రశాంత్ సూచనలతో రానున్న అసెంబ్లీ ఎన్నికలల్లో ఆదిత్యను బరిలోకి దింపేందుకు ఠాక్రే సిద్ధమయ్యారు. అంతే కాదు మహారాష్ట్ర సీఎం పీఠంపై కూడా శివసేన కన్నేసింది. ఈ విషయాన్ని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆదిత్యాను మరింత తీర్చిదిద్దే బాధ్యతను ప్రశాంత్ కిషోర్‌పై పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వారిద్దరి మధ్య భేెటీ జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎవరూ కూడా అధికారిక ప్రకటన చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment