![Undavalli Arun Kumar Slams Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/9/56.jpg.webp?itok=gi9Yg3ZK)
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్
రాజమండ్రి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఎన్‌ఓలో ప్రసంగించిన అంశాన్ని ఏపీ ప్రభుత్వ పోర్టల్‌లో ఎందుకు పెట్టలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ.. జీరో బడ్జెట్ పేరిట నేచురల్ ఫార్మింగ్ గురించి వివరించి, రూ.16 వేల 600 కోట్ల ఎంవోయూను చంద్రబాబు, సిఫ్ సంస్థతో ఎందుకు చేసుకున్నారని సూటిగా అడిగారు. దేశం మొత్తం మీద వచ్చిన పెట్లుబడుల్లో 20 శాతం మనకే వచ్చిందని,18 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు వచ్చాయని గతంలో చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు.
వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం ప్రకటించాలని, ఇప్పటికైనా యదార్థాలు మాట్లాడాలని ఉండవల్లి కోరారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల జనాన్ని పోలవరం ప్రాజెక్టు చూపించటానికి తీసుకు వెళ్లినందుకు 20 కోట్ల రూపాయల వ్యయం చేయటం దారుణమన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పందించాలని కోరారు. ఇదే విషయం గురించి ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థను ప్రశ్నిస్తే ఆర్టీఐలోని సెక్షన్ 8 ప్రకారం వివరాలు ఇవ్వడం కుదరదని చెప్పారని వెల్లడించారు.
రామోజీ మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం గురించి 2005లో రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి తన ఆత్మకథలో రాసుకున్నారని తెలిపారు. రామోజీరావు శిక్షలకు అతీతుడు అనే పద్ధతిలో అందరూ వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment