ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాతో రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర | Uttam Kumar Reddy Fires On BJP | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాతో రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర

Published Tue, Feb 18 2020 2:10 AM | Last Updated on Tue, Feb 18 2020 2:10 AM

Uttam Kumar Reddy Fires On BJP - Sakshi

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: స్వాతంత్య్రాననంతరం గత 60 ఏళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో దేశంలో నివసించే అన్ని వర్గాల ప్రజలు భయం లేకుండా జీవించారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత 6 ఏళ్ల బీజేపీ పాలనలో దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం తెస్తే నేడు బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా అమలు చేయడంలో భాగంగా ఆ రిజర్వేషన్లను ఎత్తేసేందుకు కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, కేంద్ర వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం సామాజిక న్యాయాన్ని అందించింది కాంగ్రెస్సే అన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు హక్కు కాదని సుప్రీం చెప్పడం పట్ల దేశంలోని దళిత, గిరిజన మైనార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయని, ఇందుకు బీజేపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరే కారణమన్నారు. ఆ వర్గాలకు భరోసా కల్పించేందుకే కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.  

టీఆర్‌ఎస్‌లో అలాంటి పరిస్థితి ఉందా? 
కాంగ్రెస్‌ మూల సిద్ధాంతమే సామాజిక న్యాయమని, తాము ఓట్ల కోసం ధర్నా చేయడం లేదని, ఇప్పట్లో ఎన్నికలు లేవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ బలంగా కోరుకుంటోందని, ఒక దళితుడైన దామోదరం సంజీవయ్యను సీఎంను చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. అదే టీఆర్‌ఎస్‌లో అలాంటి పరిస్థితి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. దళిత సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్‌ తన కేబినెట్‌లో ఒక్క మాదిగ నాయకుడికి కూడా స్థానం ఇవ్వలేదని, గిరిజన, మైనార్టీ రిజర్వేషన్ల గురించి పార్లమెంటులో ఒక్క రోజు కూడా మాట్లాడలేదని విమర్శించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ ఏకీభవించబోదని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీలేని పోరాటం చేస్తామని, చట్టసభల్లో కూడా పోరాడతామని చెప్పారు.  

బలహీన వర్గాలను అణచివేసే యత్నం: భట్టి 
బీజేపీ ఆధ్వర్యంలో రిజర్వేషన్ల ఎత్తివేతకు జరుగుతున్న కుట్ర చాలా ప్రమాదకరమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాల ప్రజానీకాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, కాం గ్రెస్‌ అధికారంలో లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీల వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకే రిజర్వేషన్ల అం శాన్ని తెరపైకి తెచ్చారన్నారు. కేసీఆర్‌ గిరిజన, మైనార్టీల వ్యతిరేకి అని, అందుకే హామీ ఇచ్చిన రిజర్వేషన్లను అమలు చేయడం లేదన్నారు.

రిజర్వేషన్లు ఎత్తేయాలనే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కు ట్రలను అమలు కానీయబోమని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా వ్యాఖ్యానించారు. ఈ కుట్రను ఎదుర్కొనేందు కు రాహుల్, సోనియాల నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. ధర్నాలో మాజీ మంత్రులు కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మ య్య, గీతారెడ్డి ,షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పార్టీ నేతలు వీహెచ్, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీగౌడ్, సంపత్‌కుమార్, బలరాం నాయక్, రాములు నాయక్, మల్లు రవి, జెట్టి కుసుమకుమార్, దాసోజు శ్రవణ్‌ కుమార్, కోదండరెడ్డిలతో పాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement