![V Hanumantha Rao Raised Doubts Of EVM Tampering In Telangana Elections - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/11/v-hanumanth-rao.jpg.webp?itok=htCdijhb)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని ఆరోపించారు. ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో మంగళవారం ఆయన ఓ మీడియా చానెల్‌తో మాట్లాడారు. ‘నేను మొదట్నుంచి చెబుతున్నా.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని, నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఫలితాలు చూస్తే ట్యాంపరింగ్ జరిగనట్లు స్పష్టమవుతోంది. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. తీరా ఫలితాలు చూస్తే వేరేలా ఉన్నాయి. ఒక్క రోజు క్యాంప్ ఆఫీస్‌కు రాకుండా ఇంట్ల పడుకున్న వ్యక్తికి జనాలు ఎలా ఓటేస్తారు.
బ్యాలెట్ పేపర్‌లు పింక్ కలర్‌లో ఉన్నప్పుడే అనుమానం వచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు కూడా ట్యాంపరింగ్ జరిగింది. లేకుంటే టీఆర్‌ఎస్ వారు గెలిచే స్థానాల సంఖ్యను ఖచ్చితంగా ఎలా చెబుతారు. మేం అప్పటి నుంచి ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం. మమ్మల్ని పట్టించుకునేవాడే లేడు. ఈసీఐఎల్ ఉద్యోగులతో కేసీఆర్ కుమ్మక్కై ట్యాంపరింగ్ చేశారు. బయట రాష్ట్రాలకు గురించి తనకు తెలియదని, కానీ ఇక్కడ మాత్రం ట్యాంపరింగ్ జరిగిందన్నారు. ఫలితాల్లో ఇంత భారీ వ్యత్యాసం వస్తే అనుమానం రాదా?’ అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికలకు ఈవీఎంలను ఒప్పుకునేది లేదని, బ్యాలెట్ బాక్సులతోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాజా ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ 90 స్థానాలు సాధించే దిశగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment