
సాక్షి, కాకినాడ : నమ్మక ద్రోహం చేసిన వారిని, మాట తప్పిన వారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరని వైఎస్సార్ సీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. శుక్రవారం వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 600 హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి 15 ఏళ్లు హోదా ఇస్తామన్న వెంకయ్యనాయుడు మాటల్ని గుర్తుచేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మాట తప్పిందన్నారు. ‘ఇది చంద్రబాబుపై దీక్ష మాత్రమే కాదు.. కేంద్రంపై గర్జన కూడా’ అని అన్నారు. ఏపీకి హోదా విషయంలో చంద్రబాబు అనేక మార్లు యు టర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే ఏపీ మనుగడ సాధిస్తుందన్నారు. వైఎస్ జగన్ మాత్రమే హోదా కోసం అనేక సార్లు పోరాటం చేశారని తెలిపారు.
రాష్ట్రంలో నయవంచన పాలన నడుస్తోంది: కన్నబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నయవంచన పాలన నడుస్తోందని వైఎస్సార్ సీపీ నేత కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. తన సొంత మనషుల కోసం అధికారాన్ని వాడుకున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో చంద్రబాబు కలిసి తిరుగుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మొదటినుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని తెలిపారు. హోదాపై అనేక సార్లు మాట మార్చింది చంద్రబాబేనన్నారు.
ఏపీ ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారు : కోలగట్ల
ఆంధ్రా ప్రజల ఆత్మాభిమానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోనియా గాంధీ వద్ద తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి వ్యాఖ్యానించారు. శుక్రవారం వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఏపీకి ద్రోహం చేసిందన్న చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి తిరుగుతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలకు జరిగిన అవమానాన్ని చంద్రబాబు మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ హామీలను చంద్రబాబు నెరవేర్చారో.. దమ్ము, ధైర్యం ఉంటే టీడీపీ మేనిఫెస్టోపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోని సువర్ణ పాలన వైఎస్ జగన్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment