
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చీకటి ఒప్పందాలు చేసుకుని ప్రజలను మోసం చేస్తే.. వారు పవన్‌ను క్షమించరని వైఎస్సార్ సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. ఏదో ఒక రూపంలో చంద్రబాబుకు పవన్ మద్దతు ఇస్తూనే ఉన్నారని అన్నారు. నాలుగేళ్లుగా హోదాపై ఎన్నో విధాలుగా చంద్రబాబు మభ్యపెట్టారని మండిపడ్డారు. బాబు ప్రమాణ స్వీకారం చేసి ఇచ్చిన మొదటి హామీ నుంచి అన్నీ గాల్లో కలిసిపోయాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్ మాత్రమే పోరాటం చేశారని తెలిపారు.
అందుకే చంద్రబాబు 28 సార్లు ఢిల్లీ వెళ్లారు : మేకపాటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏ మాత్రం ప్రజాస్వామ్య విలువలు లేవని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ స్థానాలు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఇబ్బందులు పెట్టడం కోసమే చంద్రబాబు 28సార్లు ఢిల్లీ వెళ్లారన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తామని మోదీ చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా ఇవ్వలేమని మాట మార్చారని చెప్పారు. ప్రత్యేక హోదా కాదు.. ప్యాకేజీ ఇస్తామంటే చంద్రబాబు తలాడించారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి నయవంచకుడు ప్రజాస్వామ్యంలో ఉండటానికి తగదని విమర్శించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి ప్రజలందరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు.
ఏపీకి ప్రత్యేక హోదా సంజీవిని : ఆదిములపు సురేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని వంటిదని వైఎస్సార్ సీపీ నేత ఆదిములపు సురేష్ వ్యాఖ్యానించారు. శుక్రవారం వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతి పాలనను అంతమొందించాలన్నారు. నాలుగేళ్లు హోదా అడగని బాబు ఇప్పుడు యు టర్న్‌తీసుకున్నారని మండిపడ్డారు. ప్రజల అభీష్టాలను చంద్రబాబు తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 30 ఏళ్లపాటు ప్రజల కష్టాలను తన భుజాలపై మోస్తారని హామీ ఇచ్చారు.
ధర్మపోరాటం కాదు.. పచ్చపోరాటం : పార్థసారధి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తోంది ధర్మపోరాటం కాదని, పచ్చ పోరాటమని వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి విమర్శించారు. శుక్రవారం వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పాలనలో మంత్రులే అవినీతికి పాల్పడుతున్నారని, మొత్తం ఏపీని దోపిడి చేశారని ఆరోపించారు. దోమలపై కూడా చంద్రబాబు గెలుపు సాధించలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ధర్మపోరాటం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని నొక్కిఒక్కానించారు.
Comments
Please login to add a commentAdd a comment