
సాక్షి, గూడూరు (నెల్లూరు) : తిరుపతి ఎంపీగా గెలిపించిన ఓటర్లకు తాను విశ్వాసంగా ఉన్నానని, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగలేదని మాజీ ఎంపీ, గూడూరు అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరప్రసాద్ తెలిపారు. వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తనను ఎంపీగా గెలిపించిన గూడూరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తనతో పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను కూడా ఇక్కడి ప్రజలు గెలిపించారని, కానీ ఆ ఎమ్మెల్యే అమ్ముడుపోయి గెలిపించిన ఓటర్లకు తీవ్రని అన్యాయం చేశారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిందే కాకుండా సొంత ఇంటికి వెళ్లినట్లు ఉందని సిగ్గులేకుండా చెప్పారన్నారు. ఆయన గెలుపు కోసం అహర్నిషులు కృషి చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనే 250 కేసులు పెట్టించారని వరప్రసాద్ ధ్వజమెత్తారు. ప్రతి ఊరు తిరుగుతానని, ప్రతి ఇంటికి వస్తానని ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుంటానన్నారు. తనను గూడూరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఐఏఎస్ అధికారిగా ఉన్న అనుభవంతో నిధులు తీసుకొచ్చి గూడూరు అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు.
చంద్రబాబూ నీవు ముఖ్యమంత్రివా?
ప్రత్యేకహోదాను ఏనాడు చంద్రబాబు కోరలేదని, ఆయన మేనిఫెస్టో అంతా అబద్ధాలమయమని మండిపడ్డారు. 600 హామీలిచ్చి ప్రతీ ఒక్కరినీ చంద్రబాబు మోసం చేశారన్నారు. ఐదేళ్ల నుంచి యువకుల ఉద్యోగాల గురించి చంద్రబాబుకు గుర్తుకు రాలేదన్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని మహిళలను బాబు మోసం చేశారని, రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు దగా చేశారని, రుణమాఫీ కాదు కదా.. రుణాలపై వడ్డీలను కూడా మాఫీ చేయలేదన్నారు. చంద్రబాబును నమ్మిన యువకులను నట్టేటా ముంచారని, మత్సకారులు, దళితులు సహా అందర్నీ చంద్రబాబు మోసం చేశారన్నారు. విభజన హామీలు తీసుకురాలేని చంద్రబాబు ఒక అసమర్థత ముఖ్యమంత్రని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు తాయిలాలు ప్రకటిస్తారని, నాలుగున్నరేళ్ల పాలనలో చంద్రబాబు ఏమీ చేయలేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment