సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలపై టీడీపీ నేతలే పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. పోలీసులకు షర్మిల చేసిన ఫిర్యాదుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎదురుదాడికి దిగటం బాధాకరమన్నారు. షర్మిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ర్పచారం చంద్రబాబుకు తెలియదా అంటూ ప్రశ్నించారు. పోలీసుల విచారణలో ఆ పార్టీ వాళ్లు కచ్చితంగా బయటకు వస్తారన్నారు. టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, చంద్రబాబు బెదిరింపులకు దిగటం ఏంటని మండిపడ్డారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే ఆమె మాటల్లోనే..
‘షర్మిలకు అండగా ఉంటామని చంద్రబాబు కనీసం భరోసా ఇవ్వకపోవడం బాధకరం. ఆయన స్పందించిన తీరు దుర్మార్గం. ఇలాంటి ఘటనలే టీడీపీ నేతల ఇంట్లో వాళ్లకు జరిగితే ఇలాగే చేస్తారా? మిగతా మహిళల పరిస్థితి ఏంటి?. టీడీపీ నాలుగేళ్ల పాలనలో మహిళకు న్యాయం చేసిన ఘటన ఒక్కటైనా ఉందా?. విలువలు, ప్రజాస్వామ్యం, నైతిక విలువలు అంటూ మైకుల ముందు చంద్రబాబు మాట్లాడతారు. కాని ఆయన పాటించరు. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ఏపీ నేరాంధ్రప్రదేశ్‌గా మారింది. నాలుగేళ్లలో పోలీసులు వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో ప్రాథమిక విచారణ జరగకుండానే.. చంద్రబాబు, డీజీపీ మాట్లాడిన తీరు శోచనీయం’అంటూ వాసిరెడ్డి పద్మ టీడీపీ నాయకులపై నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment