
మాధవ్‌ను సన్మానిస్తున్న డా.సిద్దారెడ్డి
కదిరి: ‘చాలా పేదరికం నుండి వచ్చాను. మా తాత గొంగడి భుజాన వేసుకొని గొర్రెలు మేపి నన్ను చదివించారు. పేదల కష్టాలు బాగా తెలుసు.. ఆ పేదలకు నా వంతు సేవలు అందించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చా. వారికి సేవకుడిగా పనిచేస్తా. బడుగులకు వైఎస్సార్ సీపీ మంచి వేదిక. విధి నిర్వహణలో భాగంగా నేను జగన్ పాదయాత్రలో పాల్గొని పేదల పట్ల ఆయన చూపిన ప్రేమను కళ్లారా చూశాను. అందుకే ఈ పార్టీలో చేరాను’ అని వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త కురుబ గోరంట్ల మాధవ్ అన్నారు. ఆ పార్టీ కదిరి సమన్వయకర్త డా.పెడబల్లి వెంకట సిద్దారెడ్డి సోమవారం గోరంట్ల మాధవ్‌ను నేరుగా ఆయన గృహంలో కలిసి సన్మానించారు. మాధవ్ నేతృత్వంలో హిందూపురం పార్లమెంట్ పరిధిలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాధవ్ మాట్లాడారు. తాను సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసినట్లు వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఇప్పటికీ ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి కష్టం ఇకపై ఎవ్వరికీ రాకుండా చూస్తానన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఉన్నత చదువుల భాగ్యం కలుగుతుందని భరోసానిచ్చారు.
‘మీరు మీ పిల్లలను బడికి పంపినందుకు ప్రతి ఏటా ఆ తల్లి ఖాతాలో రూ15 వేలు జమచేస్తాను. మీ పిల్లలను ఇంజినీరింగ్ చదివిస్తారో, డాక్టర్‌ను చేయాలనుకుంటారో నాకు వదిలిపెట్టండి. వారి చదువులకయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను’ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన భరోసా నాలో స్ఫూర్తిని రగిలించాయి. అందుకే జగన్ మాటలకు బాగా ఆకర్షితుడినయ్యాను. ఆయనకు అభిమాని అయ్యాను. ఇదే నన్ను వైఎస్సార్‌సీపీలో చేరేందుకు కారణమైంది.’ అంటూ వివరించారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డితో తనకు వ్యక్తిగత శత్రుత్వం ఏదీ లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాల మేరకే తాను వ్యవహరిస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment