సాక్షి, దామలచెరువు : సొంత కంపెనీ హెరిటేజ్ బాగు కోసం చంద్రబాబు వేలాదిమంది రైతుల పొట్టకొట్టాడని స్థానిక ఉద్యమకారుడు వెంకటాచలం తెలిపారు. చంద్రబాబు పనిగట్టుకుని మూయించిన చిత్తూరు డైరీ తిరిగి తెరుచుకునేదాకా చెప్పులు, చొక్కా ధరించబోనని 11 ఏళ్లుగా దీక్ష చేస్తోన్న ఆయన.. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుతెలిపారు. 55వ రోజు పాదయాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వైఎస్ జగన్.. వెంకటాచలంతో మాట్లాడించారు.
‘‘6వేల లీటర్ల పాలతో మొదలై అంచెలంచెలుగా అభివృద్ధి చెందిన చిత్తూరు డైరీని చంద్రబాబు సర్వనాశనం చేశాడు. హెరిటేజ్ లాభాల కోసం పాడిరైతులను నట్టేటముంచాడు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులు, ఎదురుతిరిగితే జైళ్లు! నా జీవితం కాలిపోయినా ఫర్వాలేదు. చిత్తూరు డైరీని మాత్రం తిరిగి తెరిపించాల్సిందేనని కంకణం కట్టుకున్నా. అప్పటిదాకా చొక్కా, చెప్పులు ధరించబోనని శపథం పెట్టుకున్నా. డైరీతోపాటు చిత్తూరు, రేణిగుంటలోని చక్కెర ఫ్యాక్టరీలను కూడా చంద్రబాబు మూతవేయించాడు. ఒకసారి మహానేత వైఎస్సార్‌ను కలిసి సమస్యలు వివరించాను. ఆయన సీఎం అయిన వెంటనే ఆ ఫ్యాక్టరీలను తెరిపించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయిన రెండు నెలలకే వాటిని మూసేయించాడు..’ అని వెంకటాచలం గుర్తుచేశారు.
మాటిచ్చిన జగన్ : మరికొద్దిరోజుల్లో రానున్న ప్రజాప్రభుత్వంలో చక్కెర ఫ్యాక్టరీలను, డైరీలను తెరిపిస్తామని వెంకటాచలంతోపాటు రైతులందరికీ వైఎస్ జగన్ మాట ఇచ్చారు. ఆసక్తికరంగా సాగిన వెంకటాచలం ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment