సొంత గడ్డకు చంద్రబాబు శఠగోపం | YS Jagan Slams Chandrababu in ramachandrapuram public meeting | Sakshi
Sakshi News home page

సొంత గడ్డకు చంద్రబాబు శఠగోపం

Published Sat, Jan 13 2018 6:15 PM | Last Updated on Wed, Jul 25 2018 5:02 PM

YS Jagan Slams Chandrababu in ramachandrapuram public meeting - Sakshi

సాక్షి, రామచంద్రాపురం (చిత్తూరు) : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గాన్ని విస్మరించారని, ఆయన పుట్టిన చంద్రగిరి నియోజకవర్గానికి శఠగోపం పెట్టారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చదివిన స్కూల్‌ పరిస్థితి అధ్వానంగా ఉందని, నియోజకవర్గంలో 70 శాతం గ్రామాల్లో తాగునీరు లేదని, వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని చంద్రబాబు విస్మరించారని ధ్వజమెత్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 61వ రోజుచిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.

నాకే భరోసా కల్పిస్తున్నారు..
ఒక వైపు వేలాదిగా నాతో కలసి అడుగులో అడుగులు వేస్తున్నారు. మరోవైపు భరోసా ఇచ్చేందుకు వచ్చిన నాకే భరోసా కల్పిస్తూ చాలా మంది అడుగులో అడుగులు వేస్తున్నారు. ఇలా నడిరోడ్డుపై నిలవాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. అయినా కూడా కిలోమీటర్ల మేర నాతో నడుస్తూ.. చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయత పంచుతున్నారు. అందరికి ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు.
 
దాదాపుగా నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనను చూశారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు తన కార్యకర్తలతో ఊదరగొడుతున్నారు. ఈ పాలన మీరంతా చూశారు. ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని సంతోషంగా ఉన్నారో లేదో ఆలోచించండి. రాష్ట్రంలో ఇవాళ ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. రైతులు, అక్కాచెల్లెమ్మలు, అవ్వతాతలు, చదువుకుంటున్న పిల్లలు సంతోషంగా లేరు.

దమ్మిడి సాయం చేయలేదు..
ఇదే నియోజకవర్గంలో ప్రతి ఏటా ఎనుగులు వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. నష్టపోయిన రైతులకు ఇంతవరకు దమ్మిడి కూడా సాయం చేయలేదు. చిత్తూరు జిల్లా మామిడి పంటలకు ప్రసిద్ధి. రైతుల వద్ద మామిడి పంటలు పండే సమయంలో ప్రైవేట్‌ వ్యాపారులు ఒక్కటై రేటు తగ్గిస్తున్నారు. వాళ్ల వద్దకు వెళ్లిన తరువాత రేట్లు ఆకాశానికి పెంచుతున్నారు.

ఇదే జిల్లాలో చెరకు పంట ఎక్కువ వేస్తారు. ఇవాళ చెరుకు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. జిల్లాలో రెండు చక్కెర ఫ్యాక్టరీలు సహకార రంగంలో ఉన్నాయి. ఇవి కాక నాలుగు ప్రైవేట్‌ ఫ్యాక్టరీలు ఇవే జిల్లాలో ఉన్నాయి. ఎప్పుడు చంద్రబాబు సీఎం అవుతారో అప్పుడు చెరకు పరిశ్రమలు మూత పడుతున్నాయి. తొమ్మిది ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీలు మూత పడితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి డబ్బులు సాయం చేసి ఆ ఫ్యాక్టరీలు తెరిపించారు.

మళ్లీ మన ఖర్మకొద్ది బాబు సీఎం అయ్యారు. మళ్లీ రెండు చెరకు పరిశ్రమలు మూత పడ్డాయి. కో–ఆపరేటివ్‌ రంగంలోని పరిశ్రమలు రైతుల గురించి ఆలోచిస్తాయి. కానీ చంద్రబాబు ఈ రెండు ప్యాక్టరీలు మూయించారు. కానీ ప్రైవేట్‌ రంగంలోని నాలుగు పరిశ్రమలు లాభాల్లో నడుస్తున్నాయి. చెరకు పరిశ్రమలు మూత వేయించడమే కాదు బెల్లం తయారీ చేయకుండా ఆంక్షలు విధిస్తున్నారు. బాబు పాలనలో లీటర్‌ నీళ్లు రూ. 20, లీటర్‌ పాలు రూ.22 ధర ఉంది. చంద్రబాబు పాల వ్యాపారంలోకి అడుగు పెట్టి చిత్తూరు డెయిరీని మూత వేయించారు.

ఈ పాలన ముగియాలి..
ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఏమన్నారు. కరెంటు బిల్లులు మూడు సార్లు పెంచారు. గతంలో రూ.100 లోపే వచ్చేది. ఇప్పుడు రూ.500, 700 చొప్పున కరెంటు బిల్లులు వస్తున్నాయి. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం అన్నాడు. ఇల్లు కట్టిస్తా అన్నారు. నాలుగేళ్ల తర్వాత ఒక్క ఇల్లైనా కట్టించాడా?. గతంలో రేషన్‌షాపుల్లో బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు, కిరోసిన, చింతపండు ఇలా తొమ్మిది రకాల సరుకులు దొరికేవి. కానీ ఇప్పుడు బియ్యం తప్ప మరేవి ఇవ్వడం లేదు.

బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. వ్యవసాయ రుణాలు బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? బ్యాంకుల నుంచి వేలం నోటిసులు ఇంటికి వస్తున్నాయి. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇంటికి రూ.90 వేలు బాకీ పడ్డాడు.

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. కర్ణాటకలో రూ.7 తక్కువకు పెట్రోలు పోస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని పెట్రోల్, డీజిల్‌ ధరలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. రాష్ట్రంలో విచ్చల విడిగా అవినీతి జరుగుతోంది. ఇసుక, మట్టి, మద్యం, బొగ్గు, కాంట్రాక్టర్లు, భూములు, చివరకు గుడి భూములను వదలకుండా చంద్రబాబు తింటున్నాడు.

గ్రామాల్లో  తినడానికి జన్మభూమి కమిటీలను వదిలేశాడు. పింఛన్లు, రేషన్‌కార్డులు కావాలన్నా లంచాలు అడుగుతున్నారు. ఇలాంటి అన్యాయం చేసే, అబద్ధాలు చేప్పే పాలన పోవాలి. రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదాలకు అర్థం రావాలి. ఈ వ్యవస్థ మారకపోతే రేపొద్దున ఇదే చంద్రబాబు  అబద్ధాలకు హద్దుపద్దు ఉండదు.

రేపొద్దున ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్మరు కాబట్టి వీళ్లను నమ్మించేందుకు ప్రతి ఇంటికి బెంజీ కారు ఇస్తాను అంటారు. ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అనే పదాలు తీసుకురావాలి. మోసం చేసిన వ్యక్తి ఇవాళ ఏమంటున్నారో తెలుసా? పింఛన్లు చాలా మందికి ఇవ్వాలని ఇవాళ తెలిసిందట. హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ వర్తించదని ఇవాళ తెలిసిందట. ఈ పాలన ముగియాలి.

మనందరి ప్రభుత్వం వచ్చాక..
రాజకీయాల్లో విశ్వసనీయత తెచ్చేందుకు నాకు మీ అందరి చల్లని దీవెనలు, ఆశీర్వాదం కావాలి. దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామన్నది నవరత్నాలు ప్రకటించాం. ఇందులో మార్పులు, చేర్పులు ఉంటే నాకు సలహాలు ఇవ్వమని అడుగుతున్నాను.

నాలుగు కత్తెర్లు ఇస్తే అది బీసీలపై ప్రేమా..?
చంద్రబాబుకు ఎన్నికలు వచ్చే సరికి బీసీలపై ప్రేమ అంటున్నారు. చంద్రబాబు పాలనను ఒక్కసారి చూడండి. ఇవాళ మన పిల్లలు ఇంజినీరింగ్‌ చదివే పరిస్థితి ఉందా? ఫీజులు లక్షల్లో ఉన్నాయి. చంద్రబాబు ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తున్నారు. మిగతా డబ్బులు ఆ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు. ఆ పిల్లాడి ఫీజులకు ఇల్లు, పొలాలు అమ్ముకోవాల్సి వస్తుంది.

ప్రేమ ఎలా ఉంటుందో మహానేత చూపించారు..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో పేదలకు భరోసా ఉండేది. ప్రతి పేదవాడిని ఇంజినీరింగ్‌ చదువుతావా? ఎంబీబీఎస్‌ చదువుతా అంటూ వైఎస్‌ఆర్‌ చదివించారు. నాన్న పేదవారి కోసం ఒక్క అడుగు ముందుకు వేశాడు. ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తాను.

మీ పిల్లాడు ఏం చదువుతాడో చదివించండి.. ఎంత ఖర్చు అయినా నేను భరిస్తాను. మీ పిల్లలకు ఇంజీనీరింగ్‌, డాక్టర్‌ చదువులు చెప్పించడమే కాదు, హాస్టల్‌ ఖర్చులకు రూ.20 వేలు ఏడాదికి ఇస్తాను. చిన్నపిల్లలను బడికి పంపిస్తే ఆ తల్లి ఖాతాలో ప్రతి ఏటా రూ.15 వేలు జమా చేస్తాను.

రూ.2 వేల పింఛన్‌
అవ్వతాతలకు వయసు పెరిగే కొద్ది తిండే కాదు.. చిన్న చిన్న అవసరాలకు, మందులకు వేరే వారిపై ఆధారపడాలి. చంద్రబాబుకు ఇలాంటి వారికి పింఛన్‌ పెంచాలన్న మనసు రాదు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు రేట్లు పెంచుతారు. అవ్వతాతలకు మాత్రం పెంచాలన్న ఆలోచన రాదు. కారణం ఏంటంటే ఆ కాంట్రాక్టర్లు చంద్రబాబుకు లంచాలు ఇస్తారు కాబట్టి. మనందరికి ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల రూ.2 వేల పింఛన్, పింఛన్‌ వయస్సు 60 ఏళ్లకే తగ్గిస్తాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉన్నాయి. వీరికి పింఛన్‌ 45 ఏళ్లకే ఇస్తాం.

ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు..
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల ఇల్లు కట్టించాడు. చంద్రబాబు నాలుగేళ్లలో ఒక్క  ఇల్లు కూడా కట్టించలేదు. మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి పేద వాడికి పక్కా ఇల్లు కట్టిస్తాను. వీటిలో ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నేను మీ మధ్యే ఉన్నాను. రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయతను తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ అడుగులో అడుగు వేయాలని కోరుతున్నాను. మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement