
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, బీసీలపై సీఎం కేసీఆర్‌ది కపట ప్రేమ అని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు(వీహెచ్) అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కర్ణాటకలో అక్కడి సీఎం సిద్ధరామయ్య పెద్ద ప్రకటన ఇచ్చారని, ఇక్కడ కేసీఆర్ పేపర్‌లో ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. దీంతో కేసీఆర్‌కు ఎస్సీలపై ఎంత ప్రేమ ఉందో తెలిసిపోయిందన్నారు. కేసీఆర్ మాటల గారడితో మాయ చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది తామేనని, అందుకే బడుగు బలహీనవర్గాలు 2019లో కాంగ్రెస్‌కే పట్టం కడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ అంటే కేసీఆర్‌కు అంత చులకన భావం ఎందుకని నిలదీశారు. బతుకమ్మకు తన కుమార్తె కవిత ఫొటోతో ప్రకటనలు ఇవ్వొచ్చు కానీ అంబేడ్కర్ వర్ధంతికి ఇవ్వరా? అని వీహెచ్ ప్రశ్నించారు.