వేమగిరిలో అక్రమ క్వారీయింగ్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న హనుమంతరావు, హర్షకుమార్ తదితరులు
తాడితోట(రాజమహేంద్రవరం): ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే సహించేది లేదని మాజీ ఎంపీలు హనుమంతరావు, జీవీ హర్షకుమార్‌లు పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని ఆనంద్ రీజన్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముందుగా హనుమంతరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు ఆయుధంగా ఉన్న అట్రాసిటీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు సుప్రీం కోర్టు ద్వారా తీర్పు ఇప్పించిందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు జరుగుతున్న తరుణంలో అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే వారికి రక్షణ ఎక్కడా? అని ప్రశ్నించారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో దళిత, గిరిజన, బీసీలు అభద్రతా భావంతో ఉన్నారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ ఆద్వర్యంలో ఈ నెల 18న గుంటూరులో జరగనున్న మిలీనియం మార్చ్ ఫాస్ట్ కార్యక్రమాన్ని, ఈనెల 27న వరంగల్‌లో మందా కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరగనున్న సింహగర్జన మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సభలకు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు, తెలంగాణాలో కేసీఆర్‌లను అనుమతులు ఇవ్వకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఉత్తర భారత దేశంలో ఉవ్వెత్తున ఉద్యమం చేశారని పేర్కొన్నారు. ఈనెల 18న ఎస్సీ, ఎస్టీ సంఘాలతో గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో మిలీనియం మార్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పుపై ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ విధానం ఏమిటో తెలియజేయలేదన్నారు.
ప్రజాస్వామ్యం ఉందా?
వేమగిరిలో దళితుల ఇళ్ల పక్కనే మాజీ సర్పంచ్ వెంకటా చలం అనుమతులు లేకుండా 120 అడుగులు లోతు కిందకు తవ్వేస్తే ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదని మాజీ ఎంపీలు హనుమంతరావు, హర్షకుమార్‌లు అన్నారు. కరెంటు స్థంబాలనుసైతం తవ్వేసినా విద్యుత్ అధికారులు కేసులు నమోదు చేయలేదంటే వారికి ఎంత నిర్లక్ష్యమో తెలుస్తుందన్నారు. రూ.4.50 కోట్లతో ఇళ్ల చుట్టూ కాంపౌండ్ వాల్ కడతామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఇళ్లు వేరే ప్రాంతానికి తరలిస్తామనడమేంటని వారు ప్రశ్నించారు. సమావేశంలో మాల మహానాడు నాయకులు యర్రా రామకృష్ణ, దళిత సంఘాల నాయకులు దొనిపాటి అనంత లక్ష్మి, అంగటి సరళ, మామిడి ప్రియ, శైలజ, చిన్నారావు తదిరులు పాల్గొన్నారు.
ఆ ముఖ్యమంత్రులిద్దరూ దళిత ద్రోహులే..
కడియం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు దళిత ద్రోహులని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. మండలంలోని వేమగిరిలో అక్రమ క్వారీయింగ్ జరిగిన ప్రాంతాన్ని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌తో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ దళితుల ఇళ్లు కూలిపోయేలా అక్రమ క్వారీయింగ్ జరుగుతున్నా సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణం రక్షణ గోడ నిర్మించాలని, అంబేడ్కర్ పేరిట బాధితులకు కాలనీ నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేమగిరి అక్రమ క్వారీయింగ్ బాధితుల తరఫున ఢిల్లీ స్థాయిలో పోరాడేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అక్రమ క్వారీయింగ్ కారణంగా నష్టపోయిన బాధితులు ఆయనకు తమ ఆవేదనను వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి బడుగు ప్రశాంతకుమార్, విప్పర్తి ఫణికుమార్, కాగిత విజయకుమార్, కాపు సంఘం నాయకులు రామినీడి మురళి, ఫిషర్‌మెన కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు శీలి జాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment