
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పరిస్ధితి లేదని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. గెలిచిన తర్వాత ప్రజలను మరిచిపోవడం గంటాకు అలవాటని, ఒకసారి గెలిచిన చోట మరల ఎన్నికల్లో పోటీ చేయరని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ ఉత్తరనియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో ఆదివారం సీతమ్మధార, బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లోని పార్టీ కార్యాలయంలో నాయిబ్రహ్మణులకు, కళాకారులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ( ‘అధికారం కోల్పోయినా.. సీఎం అనే భ్రమలోనే..’)
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ‘గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకుంటున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ అవాస్తవాలే. ఆయనను పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదు. కేకే రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చాలా సమర్థవంతంగా పని చేస్తున్నారు. మీరు గెలిపించిన గంటా మీకు అందుబాటులో లేకుండా ఉన్నారు. గెలిచిన గంటా ఎక్కడున్నారో తెలియదు... అదే ఓడిపోయిన కేకే రాజు మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు.’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.