
సాక్షి, అమరావతి : సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అక్రమాలపై గత టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిలదీశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ప్రాజెక్టుల పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ అమల్లోకి వస్తుందనగానే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు, దేవినేని ఉమాకు వెన్నులో వణకు పుడుతుందా అని ప్రశ్నించారు. అలాగే పోలవరం ప్రాజెక్టులో దోచుకున్న ప్రతి రూపాయిని కక్కిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కుల, వర్గ బలహీనతలు లేవని తెలిపారు.
కాగా, పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం వైఎస్ జగన్ ప్రాజక్టుల పనుల్లో పారదర్శకత కోసం రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అందులోనూ తొలిగా పోలవరం ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రివర్స్ టెండరింగ్‌కు జలవనరుల శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. రివర్స్ టెండరింగ్‌తో భారీ మొత్తంలో ప్రజాధనం ఆదా అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రాజెక్టుల పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే మీకు, మీ అధినేతకు వెన్నులో వణుకు పుడుతుందా ఉమా? పోలవరంలో మీరు దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తాం. మీలాగా కుల, వర్గ బలహీనతలు సీఎం జగన్ గారికి లేవు. చూస్తారుగా తొందరెందుకు?
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 1, 2019
బాబు అలా అనడంలో వింతేమీ లేదు..
ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీకి కొత్త ఇమేజీ తీసుకొస్తానని సీఎం వైఎస్ జగన్ చెబుతుంటే.. రాష్ట్రానికి పరిశ్రమలు రావని పచ్చపార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఐటీ, ఈడీ దాడులు జరిగినప్పుడు కూడా ఇలానే మాట్లాడారని గుర్తుచేశారు. అవినీతిని వ్యవస్థీకృతం చేసిన చంద్రబాబు.. అది లేకుండా పనులెలా జరుగుతాయనడంలో వింతేమీ లేదని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment