న్యూఢిల్లీ : గత లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుపై నెగ్గి, ఫిరాయించిన నలుగురు ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ నేత వి. విజయసాయిరెడ్డి కోరారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం కలిశారు. ఫిరాయింపు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, బుట్టా రేణుక, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై నెగ్గి, అనంతరం ముగ్గురు ఎంపీలు తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లోనై పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఓ పార్టీ టికెట్‌పై నెగ్గి మరో పార్టీలోకి ఫిరాయించిన ఈ నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని చాలాకాలం కిందటే మేము ఫిర్యాదు చేసినా అవన్నీ పెండింగ్‌లోనే ఉన్నట్లు స్పీకర్ దృష్టికి విజయసాయిరెడ్డి తీసుకెళ్లారు. ఫిరాయింపులపై చర్యలు తీసుకోకుంటే రాజ్యాంగ మూల సూత్రాలకు ప్రమాదం ఏర్పడుతుందని స్పీకర్‌కు ఆయన వివరించారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మరింతమంది పార్టీ ఫిరాయించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. రాజ్యసభలో పార్టీ ఫిరాయించిన శరద్ యాదవ్, అన్వర్ అలీ పై 90 రోజులలో అనర్హత వేటు పడ్డ విషయాన్ని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అదే పద్ధతిలో లోక్‌సభలో కూడా పార్టీ ఫిరాయించిన ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు సమర్పించిన వినతిపత్రంలో విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment