ప్రజాకోర్టులో తేల్చుకుంటాం | Vysya Community Leaders Join In Trs | Sakshi
Sakshi News home page

ప్రజాకోర్టులో తేల్చుకుంటాం

Published Thu, Oct 11 2018 4:11 AM | Last Updated on Thu, Oct 11 2018 8:46 AM

Vysya Community Leaders Join In Trs - Sakshi

శ్రీనివాస్‌గుప్తాను పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: మాయమాటలు చెప్పే మాయ కూటములను నమ్మితే ప్రజలకు కష్టాలు తప్పవని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు 200 కేసులు వేశారని చెప్పారు. ప్రజా కోర్టులో తీర్పు కోస మే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. ఆర్యవైశ్య ఫెడరేషన్‌ నేత ఉప్పల శ్రీనివాస్‌గుప్తా టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో ఆయనకు గులా బీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్‌ ఆహ్వానించారు. ‘పేదరికానికి కులం, మతం ఉండదు. రాష్ట్రంలో పేదలందరికీ న్యాయం జరిగేలా కేసీఆర్‌ కృషి చేస్తున్నా రు. సామాజిక పింఛన్ల కింద రూ.200 ఇచ్చిన కాం గ్రెస్‌ నేతలు ఎక్కడాలేని బిల్డప్‌ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాగానే సీఎం కేసీఆర్‌ ఈ పింఛన్లను రూ.1,000, రూ.1500కి పెంచారు. ఆర్థికంగా వెనుకబడ్డ వారికోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం.

కేసీఆర్‌ వచ్చే ఎన్నికల కోసమే కాకుండా వచ్చే తరాల కోసం ఆలోచిస్తున్నారు. నాలుగేళ్లలో కాంగ్రెస్‌ పవర్‌ కట్‌ అయితేనే రైతులకు 24 గంటల కరెంట్‌ వచ్చింది. టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే ఇది కొనసాగుతుంది. కేసీఆర్‌ మట్టిబిడ్డ, రైతుబిడ్డ కాబట్టే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్‌ పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌లా ఉంది. కాంగ్రెస్‌లో అందరూ సీఎం అభ్యర్థులే. కాంగ్రెస్‌ నేతలు ఒకవైపు ఎన్నికలకు సై అంటూనే మరోవైపు కోర్టుల్లో కేసులు వేశారు. ఇంటి కిరాయి కడతామని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతున్నారు. రూ.15 లక్షలు ప్రజల అకౌంటులో వేస్తే బీజేపీ నేతల ఇంటి కిరాయి కూడా ప్రజలే కడతారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి 30 లేఖలు రాశారు. మహాకూటమి గెలిస్తే బాబు ప్రాజెక్టులను కట్టనిస్తాడా? వారు నాదాన్‌ దుష్మన్‌లు. పేద ఆర్య వైశ్యులకు న్యాయం చేసే బాధ్యత టీఆర్‌ఎస్‌పై ఉంది’ అని అన్నారు.

పలువురి చేరిక..
టీడీపీ దేవరకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి వ్యాసనాయక్, టీడీపీ నేత కంకణాల వెంకట్‌రెడ్డి.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 11 మంది మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు కేటీఆర్‌ సమక్షంలో బుధవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌కు చెందిన రామచంద్రరావు, మధుసూదన్‌రావులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో నారాయణపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మొదటిసారిగా బంజారా భాషలో వీడియో రూపంలో రూపొందించిన పాటను కేటీఆర్‌ ఆవిష్కరించారు.

ఉత్తమ్‌పై జగదీశ్‌రెడ్డి పోటీ చేయాలి: శంకరమ్మ
తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు బుధవారం తెలంగాణభవన్‌కు వచ్చారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి పోటీ చేయాలని డిమాండ్‌ చేశారు. ‘నాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ మద్దతు ఉంది. మంత్రి జగదీశ్‌రెడ్డి నాకు టికెట్‌ రాకుండా అడ్డుపడుతున్నాడు. నియోజకవర్గంలో పని చేయని సైదిరెడ్డికి టికెట్‌ ఇవ్వాలని చూస్తున్నారు. నాకు టికెట్‌ రాకపోతే జగదీశ్‌రెడ్డిదే బాధ్యత. నేను సూర్యాపేట నుంచి పోటీ చేస్తా. మంత్రి జగదీశ్‌రెడ్డి హుజూర్‌నగర్‌ నుంచి ఉత్తమ్‌పై పోటీ చేయాలి. నాకు ఎమ్మెల్సీ వద్దు.. ఏ పదవులు వద్దు. నేను ప్రజల మద్దతుతోనే గెలుస్తా. నాకు టికెట్‌ రాకుంటే జగదీశ్‌రెడ్డి ఇంటిముందు శ్రీకాంతాచారిలాగా ఆత్మాహుతి చేసుకుంటా’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement