
సాక్షి, హైదరాబాద్: వివిధ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలుపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ బాలశౌరి డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో కూడా శ్వేతపత్రం ద్వారా ప్రకటించాలన్నారు. చంద్రబాబు ప్రకటించిన శ్వేతపత్రాలన్నీ దొంగవేనని విమర్శిచారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలోని ఎన్నో సంస్థలు చంద్రబాబు అవినీతి పాలన గురించి ప్రస్తావించాయని, వాటిపై కూడా శ్వేతపత్రం ప్రకటిస్తే బాగుంటుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదన్నారు. అసలు ఆ అవసరమే లేదన్నారు. ఒంటరిగా పోటీ చేసే సత్తా వైఎస్ జగన్‌కు ఉందని, కానీ చంద్రబాబు ఇంతవరకు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లింది లేదన్నారు.
భావం కరెక్టుగా ఉంది... : తెలంగాణ సీఎం కేసీఆర్ తనను ఏదో అన్నారని చంద్రబాబు గింజుకుంటున్నారని, తన పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బహిరంగ సభలో మాట్లాడిన భాష విని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కూర్చున్నప్పుడు చంద్రబాబు విజ్ఞత ఏమైందని మండిపడ్డారు. కేసీఆర్ భాషలో తేడా ఉండవచ్చు కానీ, భావం మాత్రం కరెక్టుగా చెప్పారన్నారు. పబ్లిక్ మీటింగ్‌ల్లో జేసీతో పలుమార్లు వైఎస్ జగన్‌ను తిట్టించింది గుర్తులేదా? జేసీ జుగుప్సాకరం గా మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుచెప్పలేదని సీఎం బాబును నిలదీశారు.