లైన్‌ క్లియర్‌.. రాజ్యసభకు ప్రియాంక గాంధీ! | Will Congress Send Priyanka Gandhi to Rajya Sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభకు ప్రియాంక గాంధీ..!

Published Tue, Feb 18 2020 4:06 PM | Last Updated on Tue, Feb 18 2020 4:17 PM

Will Congress Send Priyanka Gandhi to Rajya Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వరుస ఎన్నికల్లో ఘోర ఓటములతో గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్‌ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. నాయకత్వలేమితో చరిత్రలో ఎన్నడూలేని విధంగా బలహీనపడుతోంది. సోనియా గాంధీ తరువాత పార్టీలో నెంబర్‌2గా పేరొందిన రాహుల్‌ గాంధీ కూడా గత ఎన్నికల్లో పూర్తిగా తేలిపోయారు. పార్టీకి నూతన ఉత్తేజం ఇస్తారనుకున్న రాహుల్‌.. కాంగ్రెస్‌ కంచుకోట అమేథిలోనే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అంతేకాకుండా గత లోక్‌సభ ఎన్నికల్లో దారుణ ఓటమిని రుచిచూశారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ముందు అనూహ్యంగా ఆ పార్టీ తురుపు ముక్క ప్రియాంక గాంధీని తెరపైకి తీసుకువచ్చారు. దీనిలో భాగంగానే కీలకమైన ఉత్తరప్రదేశ్‌ బాధ్యతలను ఆమెకు అప్పగించారు. గత ఏడాది కాలంగా ఆమె పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ.. రాజకీయంగా కీలకంగా ఎదిగారు. పార్టీలోని సీనియర్లను కలుపుకుంటూ.. జూనియర్‌ నేతలకు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యువతను ఆకట్టుకునేందుకు ప్రియాంక గాంధీని రాజ్యసభకు నామినేట్‌ చేస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికితోడు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తమ రాష్ట్రం నుంచి ప్రియాంకను పెద్దల సభకు పంపాలనే డిమాండ్‌ను సోనియా గాంధీ ముందు ఉంచినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

మధ్యప్రదేశ్‌ నుంచి ఎన్నిక..!
మొత్తం 245 స్థానాలు గల రాజ్యసభలో ఈఏడాది  ఏప్రిల్‌ నాటికి 55 స్థానాలు ఖాళీ కానున్నాయి. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పాలిత ప్రభుత్వాలే ఉన్నాయి. దీంతో రాజ్యసభలో 15 స్థానాలకు పైగా ఆ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఓటమి చెందిన ముఖ్య నేతలతో పాటు ప్రియాంకను కూడా ఎగువ సభకు పంపాలనే డిమాండ్‌ ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. లోక్‌సభలో రాహుల్‌ గాంధీ, రాజ్యసభలో ప్రియాంక పార్టీని ముందుండి నడిపిస్తారని, ఆ బాధ్యతలు వారికి అప్పగిస్తే బాగుంటుందని పార్టీలోని ఓ వర్గం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ బలం 82 ఉంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఎగువ సభలో బీజేపీకి తగిన సంఖ్యా బలం లేదు. దీంతో బిల్లులను ఆమోదించుకోవడం వంటి సందర్భాల్లో ఇబ్బంది ఎదుర్కొంటోంది. ఇకపై విపక్షాల బలం తగ్గనుండడంతో ఎన్డీయేకు ఈ సారి బలం పెరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో 1, ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోనుంది. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సైతం అభ్యర్థులను గెలిపించుకుని బలం పెంచుకోనుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 46 మంది సభ్యులున్నారు. తాజాగా జరిగే ఎన్నికల్లో కొన్ని సిట్టింగ్‌ స్థానాలను హస్తం పార్టీ కోల్పోనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement