పసుపు కుంకుమ పేరుతో తిప్పుకుంటున్నారని రోడ్డుపె బైఠాయించి నిరసన తెలుపుతున్న మహిళా సంఘ సభ్యులు
సాక్షి, ఓడీ చెరువు : మార్చి మొదటి వారంలో అందాల్సిన రెండో విడత ‘పసుపు–కుంకుమ’ డబ్బులు ఏప్రిల్ నెలలో కూడా అందక మహిళలు అవస్థలు పడుతున్నారు. మహిళా సంఘ సభ్యురాళ్లు రోజూ ఐకేపీ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. రెండు రోజుల నుంచి వందలాది మంది మహిళలు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేవారులేరు. దీంతో మహిళలు మండుటెండను సైతం లెక్కచేయకుండా బైఠాయించి, అక్కడే ఆందోళన చేశారు.
ఓడీసీ, టి.కుంట్లపల్లి, ఇనగలూరు, ఎంబీ క్రాస్, వంచిరెడ్డి పల్లి, మలకవారిపల్లి, పెదగుట్లపల్లి తదితర గ్రామాల మహిళా సంఘాల సభ్యులు హేమావతి, లక్ష్మిదేవి, రేవతి, ప్రమీళ, ఆదిలక్ష్మి, నాగలక్ష్మి, జయమ్మ తదితరులు మాట్లాడుతూ రెండు నెలల క్రితమే చెక్కులు ఇచ్చినా ఇప్పటికీ డబ్బు చేతికందలేదన్నారు. రోజూ కార్యాలయానికి వస్తేనే డబ్బులు ఇప్పిస్తామని ఐకేపీ సిబ్బంది చెప్తున్నారని అన్నారు. రెండు రోజులుగా వస్తున్నా డబ్బులు డ్రా చేసి ఇవ్వలేదని, పగలంతా బ్యాంకు వద్ద పడిగాపులు కాస్తున్నా ఎవరూ పట్టించుకునేవారులేరని వాపోయారు. పండుగ పూట ఇంటి వద్ద పనులు వదలి బ్యాంకు వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా మహిళలకు చెల్లించాల్సిన రెండో విడత పసుపు కుంకుమ చెక్కులు డ్రా చేసి అందేలా చూడాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment