
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వరుస విమర్శలతో మోదీని, బీజేపీని ఇరకాటంలోకి నెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీ ప్రయత్నిస్తుండగా.. తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'గుజరాత్ ప్రజలు ఈ ఎన్నికల ద్వారా రెండు మంచి పనులు చేశారు. ఒకటి మన్మోహన్ సింగ్ నోరు తెరిపించడం.. మరొకటి రాహుల్ గాంధీకి గుడులకు వెళ్లడం వారు నేర్పించారు' అని యోగి అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం చేసుకుంటుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన శైలికి భిన్నంగా ఘాటైన పత్రికా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక, గుజరాత్ ఎన్నికలు మొదలైననాటినుంచి రాహుల్ గాంధీ వరుసగా ఆలయాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే.