
శ్రీకాకుళం జిల్లా బాహడాపల్లిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు తమ సమస్యలను వివరిస్తున్న ఉద్దాన రైతాంగ సంక్షేమ సంఘం నేతలు
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రైతులపై రాజద్రోహం కేసు పెట్టడం ఏమిటి? ఇంత అన్యాయమా? అని ప్రతిపక్ష నేత,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనందరి ప్రభుత్వం రాగానే ఈ అక్రమ కేసులన్నీ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 335వ రోజు మంగళవారం కొత్త సంవత్సరం ప్రారంభం రోజు ఆయన శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని పలు పల్లెల్లో పాదయాత్ర సాగించారు. మందస మండలం హాడపల్లి గ్రామం వద్ద రైతు సంఘం నేతలు మామిడి మాధవరావు, నల్లా హడ్డి, ఎం.తులసయ్య, ఎం.కృష్ణారావు, మజ్జి బాబూరావు(రిటైర్డు ఎంఈఓ)తో పాటు రైతులు దాసరి శ్రీరాములు, జె.కోదండ, నీలకంఠం, సాలిన వీరాస్వామి, పుచ్చ దుర్యోధనతో పాటు కేసులున్న మరికొందరు రైతులు జగన్‌ను కలుసుకుని తమపై కేసులు పెట్టడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. ‘అయ్యా.. మొన్నటి తిత్లీ తుపాను బీభత్సానికి ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. బాధితులైన రైతులు, ఆయా గ్రామాల ప్రజలు రోడ్డున పడి, సాయం కోసం ఆర్తనాదాలు చేశారు.
ఈ సమయంలో ప్రభుత్వ సాయం ఎంతకీ అందక పోవడంతో ఉద్దాన రైతాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేతలు, స్థానికంగా కొంత మంది రైతులు కలిసి బాధితులకు బియ్యం, పప్పులు, దుప్పట్లు, కొవ్వొత్తులు(కరెంటు లేనందువల్ల) ఉచితంగా పంపిణీ చేశారు. అప్పటికే ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సాగుతూండింది. రైతులు ఎక్కడైనా ఆందోళనకు దిగి చంద్రబాబు పర్యటనకు అడ్డొస్తారేమోననే అనుమానంతో.. ఉద్దానం ప్రాంతంలో రైతు ర్యాలీలు నిర్వహించామనే నెపాన్ని చూపుతూ మాపై అణచివేతకు దిగారు. మాలో 16 మందిని అరెస్టు చేసి రాజద్రోహం కింద కేసులు పెట్టారు’ అని వారు జగన్‌కు వివరించారు. వీరి కష్టంపై జగన్ స్పందిస్తూ.. ‘మనందరి ప్రభుత్వం రాగానే రైతు సంఘం నేతలు, రైతులపై ప్రభుత్వం అక్రమంగా పెట్టిన అన్ని కేసులనూ బేషరతుగా ఎత్తి వేస్తాం. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటాం. ఈ ప్రభుత్వం రైతుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోంది’ అన్నారు. జగన్ భరోసాపై పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చిన రైతులు హర్షం వ్యక్తం చేశారు.
గిట్టుబాటు ధర కల్పించాలి
దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి పంటకూ గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని పలువురు రైతులు వైఎస్ జగన్‌కు విన్నవించారు. మత్స్యకారుల చేపల వేట నిషేధ సమయంలో ఆదుకోవాలని కోరారు. జంతిబంద చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చే విషయం పరిశీలించాలని, తుపానుల సమయంలో పెనుగాలుల తీవ్రతను తగ్గించేందుకు తీరం వెంబడి తాటి, మొగిలి, సరుగుడు, ఈత చెట్లతో మడ అడవులను పెంచాలని కోరారు. వీటన్నింటిపై జగన్ సానుకూలంగా స్పందిస్తూ.. పంట వేయడానికి ముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తామని, మత్స్యకారులనూ అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. మిగతా సమస్యలపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
జీడి కార్మికులకు జగన్ భరోసా
పలాస ప్రాంతంలోని జీడి పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులను ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. బహడపల్లి గ్రామంలో జీడి పరిశ్రమ కార్మికులంతా వైఎస్ జగన్‌ను కలిసి సమస్యలు వివరించారు. ఎస్.నాగమ్మ అనే కార్మికురాలు జగన్‌తో మాట్లాడుతూ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, కేజీ జీడి పిక్కలు కటింగ్ చేస్తే ఇచ్చే రూ.23 గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. ఎస్.పార్వతి అనే కార్మికురాలు మాట్లాడుతూ జీడిపిక్కల కటింగ్ చేస్తున్న కార్మికులు కీళ్లు, ఎముకల నొప్పులతో బాధపడుతున్నారని, పలువురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారన్నారు. కటింగ్ మిషన్ వద్ద ఎక్కువ సమయం పని చేసినందువల్ల ఈ పరిస్థితి ఎదురవుతోందన్నారు.
ఈ ప్రాంతంలో తమకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. చేతి వేళ్లకు చీడి అతుక్కుని పుండ్లు పుట్టి రేషన్ వద్ద బయోమెట్రిక్ పడడడం లేదన్నారు. ఈ కారణంగా రేషన్ ఇవ్వడం లేదని వాపోయారు. జీడిపరిశ్రమలో ఆధునిక పరికరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న జీడిపరిశ్రమ యజమాని కొంచాడ తిరుమలరావుతో జగన్ మాట్లాడారు. మనందరి ప్రభుత్వం రాగానే కార్మికులకు వైద్య సేవలు మెరుగు పరుస్తామని భరోసా ఇచ్చారు. మహిళలంతా ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని 45 ఏళ్లు దాటిన ప్రతి అక్కకూ నాలుగేళ్లలో రూ.75 వేలు ఇస్తామని భరోసా ఇచ్చారు.
ఈ ఏడాది మాకు ప్రత్యేకం..
‘ఈ ఏడాది తొలి రోజునే జగనన్న మా ఊర్లో అడుగు పెట్టాడు. ఆయన్ను కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది’ అని మంగళవారం ఉద్దానం పల్లె ప్రజలు అన్నారు. మత్స్యకారులు, ఉద్యాన పంటల రైతులు, బీసీలు ఎక్కువగా నివసించే వంకులూరు క్రాస్, చిన్న వంకులూరు, అనకాపల్లి క్రాస్, రంగోయిక్రాస్, శ్రీరాంనగర్, బహాడపల్లి, నల్ల బొడ్లూరు, గుజ్జులూరు, బి.జగన్నాథపురం, నారాయణపురం గ్రామాల్లో జగన్ పాదయాత్ర సాగిస్తున్నప్పుడు కొత్త దుస్తులు ధరించిన మహిళలు, సాధారణ జనం ఆయన వద్దకు వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. 2019లో మీరు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని వారంతా మనసారా ఆకాంక్షించారు. 2018లో భీకరమైన తిత్లీ తుపానుతో తామంతా తల్లడిల్లి పోయామని అలాంటి రోజు మళ్లీ రాకూడదని భావిస్తున్నామన్నారు. జగన్ భరోసా తమకు ఎంతో ఊరటను కలిగించిందన్నారు.