
సాక్షి, తాడేపల్లి: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం జరిగిన సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కాగా సమావేశం అనంతరం లోక్‌సభా పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి మేలు చేసే ప్రతీ విషయంలో ఎంపీలు ముందుండాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర సమస్యలు, ప్రత్యేక హోదా కోసం సభలో ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటామని పేర్కొన్నారు. పోలవరం నిధుల సత్వరమే విడుదలయ్యేలా ప్రయత్నిస్తామన్నారు.
అదే విధంగా ప్రాజెక్టు భూసేకరణ కోసం కూడా ఒత్తిడి తీసుకువస్తామని మిథున్‌రెడ్డి వెల్లడించారు. అలాగే రామాయపట్నం పోర్టు, వెనుకబడిన జిల్లాల నిధుల కోసం పోరాటం చేస్తామన్నారు. విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలను ప్రస్తావిస్తామని వెల్లడించారు. ఇక రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం నిధుల కోసం పోరాడాలని ముఖ్యమంత్రి సూచించినట్లు పేర్కొన్నారు.