సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. స్పీకర్ స్థానంలో తమ్మినేని ఆసీనులైన తర్వాత మొదట సభా నాయకుడైన సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తొలి ప్రసంగించారు. ‘కొత్త స్పీకర్‌గారికి నా తరఫున, మా ప్రభుత్వం తరఫున, ఏపీ ప్రజలందరి తరఫున అభినందనలు’ తెలిపారు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికై.. సౌమ్యునిగా తమ్మినేని సీతారాం మంచి పేరు తెచ్చుకున్నారని, మీలాంటి వ్యక్తి స్పీకర్‌గా మంచి సంప్రదాయాలు పాటిస్తూ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తారని నమ్ముతున్నామని పేర్కొన్నారు. మంచి స్పీకర్‌గా అనగానే లోక్‌సభ వరకు సోమ్‌నాథ్ ఛటర్జీ, జీవీ మూలంకర్ లాంటి పెదపెద్దవారి పేర్లు గుర్తుకువస్తాయని, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. బీవీ సుబ్బారెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు, కోన ప్రభాకర్‌రావు.. కొందరు మహానుభావుల పేర్లు కూడా గుర్తుకువస్తాయని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
‘స్పీకర్ ఎంపిక ఆలోచన వచ్చినప్పుడు ఎన్నో విషయాలు గుర్తుకువచ్చాయి. ఇదే శాసనసభలోనే విలువల్లేని రాజకీయాలు చూశాం. చట్టాలకు తూట్లు పొడుస్తూ.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయని, ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వని దిగజారిన వ్యవస్థను ఇదే చట్టసభలో చూశాం. ఇన్ని చూశాక స్పీకర్‌ను ఎన్నిక చేసేటప్పుడు నేను ఎలా ఉండాలనే మీమాంస కూడా నాలో కలిగింది. కానీ, నేను కూడా అటువంటి అన్యాయమైన సంప్రదాయాన్నే పాటిస్తే మంచి ఎక్కడా బతకదు. రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితి ఉండదు. అందుకే శాసనసభ సంప్రదాయాలు, పార్లమెంటరీ విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి తెలిసిన వ్యక్తిగా, న్యాయం చేసే వ్యక్తిగా.. అటువంటి అన్ని గుణాలు మీలో ఉన్నాయని సంపూర్ణంగా నమ్మాను. ప్రజాస్వామ్యం, చట్టసభల మీద మళ్లీ నమ్మకం పెంచేందుకు సీఎంగా నా సంపూర్ణ నిబద్ధత ఉండాలని, వ్యవస్థలోకి మార్పు తీసుకురావడానికి సీఎంగా ఓ మంచి మనస్సుతో సభాపతి పదవికి సీతారాంగారు సరైన వ్యక్తి అని మన్సస్ఫూర్తిగా నమ్మి బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరాను’ అని వైఎస్ జగన్ వివరించారు.
ప్రజలే అనర్హత వేటు వేస్తే.. ఇదే నిదర్శనం!
‘వైఎస్సార్‌సీపీ నుంచి 67 మంది గెలిస్తే.. ఏకంగా ఇదే శాసనసభలోనే 23మందిని పార్టీ మార్చి.. కండువాలు కప్పి.. అందులో నలుగురిని మంత్రులను చేశారు. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను తుంగలోకి తొక్కారు. ప్రతిపక్ష బెంచ్‌ల్లో కూర్చోవాల్సిన సభ్యులను సభలోని ట్రెజరీ బెంచ్‌ల్లో కూచుబెట్టుకున్నారు. చివరకు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నప్పుడు.. అవిశ్వాస తీర్మానం నిబంధనలను అప్పటికప్పడు రాజ్యాంగ విరుద్ధంగా మార్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని, అప్పుడే మేం సభకు వస్తామని చెప్పినా.. కనీసం పట్టించుకోలేదు. శాసనసభ అంటే శాసనాలు చేసే సభ. కానీ, దానినేచట్టం, రాజ్యాంగంతో సంబంధం లేని సభగా మార్చేశారు. అనర్హత వేటు వేయని ప్రభుత్వం మీద ప్రజలే అనర్హత వేటు వేస్తే ఎలా ఉంటుందో తాజా ఎన్నికల్లో చూశాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
దేవుడి స్క్రిప్ట్ గొప్పది...
‘దేవుడు కూడా చాలా గొప్ప స్క్రిప్ట్ రాశారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వారికి అక్షరాల 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ముగ్గురు ఎంపీలను కొన్నవారికి మూడు ఎంపీ సీట్లే వచ్చాయి. అది కూడా 23వ తారీఖున వచ్చాయి. దేవుడు ఎంత గొప్పగా స్క్రిప్ట్ రాస్తాడో చెప్పడానికి ఇది నిదర్శనం. బ్యూటీ ఆఫ్ డెమొక్రసీ, బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈ చట్టసభలో మళ్లీ ఇవాళ చూస్తున్నాం. అన్యాయం చేస్తే శిక్ష ఎలా ఉంటుందని చెప్పడానికి నిదర్శనంగా మళ్లీ మనం ఇవాళ ఏకమయ్యాం. అటు టెండర్ల వ్యవస్థలోగానీ, గ్రామస్థాయిలోగానీ, ప్రభుత్వ యంత్రాంగంలోగానీ అవినీతిని తొలగించి.. విలువలు, విశ్వసనీయతకు ఏపీని కేరాప్ అడ్రస్‌గా మార్చేందుకు మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే స్పీకర్‌గా సీతారాంను ఎన్నుకున్నాం. ఒక స్పీకర్, ఒక సభా నాయకుడు ఎలా ఉండకూడదో చెప్పడానికి గత శాసనసభ నిదర్శనమైతే.. ఎలా ఉండాలో చెప్పడానికి ఈ శాసనసభ, ఈ ప్రభుత్వం కంకణ కట్టుకుంది.
బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదు.. బ్యాక్‌బోన్ క్లాసులుగా మారుస్తామని ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో చెప్పాం. అందులో భాగంగా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ.. గతంలో ఎన్నడూలేని విధంగా మంత్రిమండలిలో దాదాపు 60శాతం పదవులు వారికే కేటాయించాం. ఐదుగురిని డిప్యూటీ సీఎంలు చేస్తే.. అందులో నలుగురు బడుగు బలహీనవర్గాల వారికి అవకాశం కల్పించాం. ఈ విషయంలో మరో ముందడుగు వేస్తూ.. తమ్మినేని సీతారాం సభాపతిగా ఎన్నుకొని.. అధికారంలోనూ, పరిపాలనలోనూ, శాసనసభలోనూ, మా కమిట్‌మెంట్‌ను, కట్టుబాటును నిరూపించకుంటున్నాం’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
అలాంటిది జరిగితే.. వెంటనే డిస్కాలిఫై చేయండి
మీ ఆధ్వర్యంలో నడిచే ఈ శాసనసభ పార్లమెంటరీ సంప్రదాయాల విషయంలో దేశానికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నట్టు సీఎం సభాపతిని ఉద్దేశించి పేర్కొన్నారు. ‘చంద్రబాబు నాయుడికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. అందులో ఐదుగురిని లాగేస్తే.. ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఉండదు.. లాగేద్దామని కొందరు నాతో చెప్పారు. అలా చేస్తే నాకు ఆయనకు తేడా లేకుండా పోతుంది. అటువంటిది ఎప్పుడైనా జరిగితే.. ఆ పార్టీలోంచి ఎవరినైనా మేం తీసుకుంటే.. వారితో రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటాం. అలాంటిది పొరపాటున జరిగితే.. వెంటనే డిస్కాలిఫై చేయండి’ అంటూ సీఎం వైఎస్ జగన్ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment